Junior Artist: సినీమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు దక్కాలంటే.. టాలెంట్ ఒక్కటే సరిపోదు. టాలెంట్‌తోపాటు, డబ్బులు, ఎవరు పిలిస్తే వారి వద్దకు వెళ్లే చొరవ ఉండాలి అంటారు. అప్పుడే వద్దన్నా అవకాశాలు వస్తాయన్న ప్రచారం ఉంది. అయితే ఎన్నో ఆశలతో రంగుల ప్రపంచంలో అడుగు పెడుతున్న అనేక మంది తమ కల నెరవేరకుండానే వెనుదిరుగుతున్నారు. హీరో, హీరోయిన్ అవుతామని వచ్చిన వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతున్నారు. వీరిలో చాలా మంది ఆర్థికంగా, శారీరకంగా వేధింపులకు, మోసాలకు గురవుతున్నారు. అన్నీ భరించుకునేవారే ఇక్కడ ఉంటున్నారు. ఇలా మరో జూనియర్ ఆర్టిస్టు కూడా మోసపోయింది. పోలీసులను నమ్ముకుంటే న్యాయం జరుగుతుందని ఓ ఎస్సైని నమ్మింది. అతడు తన మాయమాటలతో ఆమెను వలలో వేసుకున్నాడు. కానీ, చివరకు కథ అడ్డం తిరిగింది.
ఏం జరిగిందంటే..
పెళ్లి చేసుకుంటానని ఆ జూనియర్ ఆర్టిస్టును నమ్మించిన పోలీస్ అధికారి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ రక్షకభట అధికారి ఇప్పుడు కటకటాల వెనక్కివెళ్లాడు. నిజామాబాద్‌కు చెందిన పబ్బా అరుణ్(29) సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. 2021లో సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైగా పనిచేశాడు. అప్పుడే అతడికి నాగర్‌కర్నూల్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్టు(23)తో పరిచయం అయింది. బంధువుల ఇంట్లో ఉంటున్న సదరు యువతి 2022లో కుటుంబ సమస్యలపై సైదాబాద్ పీఎస్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అరుణ్‌తో పరిచయం ఏర్పడింది.
ప్రేమ పేరుతో వాడుకుని..
అప్పట్టి నుంచి అరుణ్ సదరు యువతికి తరచూ ఫోన్‌చేసి మాట్లాడేవాడు. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఎస్సై కావడంతో సదరు యువతి కూడా జీవితం బాగుంటుందని అతడి ప్రేమ నిజమని నమ్మింది. ఈ క్రమంలో సదరు యువతిని ఎస్సై లోబర్చుకున్నాడు. శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో అరుణ్ ట్రైనింగ్ పూర్తయింది. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు సదరు యువతిని ఇక్కడికి రప్పించుకుని తన అవసరం తీర్చుకునేవాడు.
మరో యువతితో పెళ్లి నిశ్చయం కావడంతో..
అయితే అరుణ్‌కు ఇటీవల వేరే యువతితో పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఓరోజు అరుణ్ ఫోన్‌లో ఫొటోలను చూసి బాధితురాలు అతడిని నిలదీసింది. షాక్ అయిన అరుణ్ నిశ్చితార్థం రద్దు చేసుకుంటానని నమ్మించాడు.
యువతి సోదరుడితో బెదిరింపులు..
ఈ క్రమంలో అరుణ్ తనకు నిశ్చితార్థం అయిన మరో యువతి సోదరుడికి విషయం చెపాడు. దీంతో అతడు జూనియర్ ఆర్టిస్టు అయిన యువతికి తరచూ ఫోన్ చేసి బెదిరించడం ప్రారంభించాడు. అరుణ్ తన చెల్లినే పెళ్లి చేసుకుంటాడని తెగేసి చెప్పాడు. అరుణ్‌కు ఫోన్‌చేసి ఈ విషయంపై ప్రశ్నించడంతో అవును అని చెప్పాడు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అరుణ్‌ను అరెస్ట్ చేశారు. ఆర్టిస్టును వాడుకుని వదిలేద్దామకున్న ఎస్సై ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు.