Sharmila Son Marriage: మేనల్లుడి వివాహానికి జగన్ ఎందుకు వెళ్ళలేదు? నిశ్చితార్థం రోజున ఎదురైన అవమానమా? లేకుంటే బిజీ షెడ్యూల్ కారణమా? పొలిటికల్ సర్కిల్లో ఇదే పెద్ద చర్చ నడుస్తోంది. పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో జరిగిన సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి రాజస్థాన్ లోని జోధ్ పూర్ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఆదివారం వివాహం జరిగింది. అయితే ఏపీ సీఎం జగన్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గత నెల హైదరాబాదులో నిశ్చితార్థ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరయ్యారు. ఆ రోజున గ్రూప్ ఫోటో తీసుకోవడానికి తన చెల్లిని స్వయంగా జగన్ ఆహ్వానించినా.. ఆమె నిరాకరించినట్లు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిశ్చితార్థానికి పిలిచి అవమానించేలా షర్మిల ప్రవర్తించారని విమర్శ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలోనే షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు జగన్ హాజరు కాలేదని తెలుస్తోంది. అటు జగన్ సతీమణి భారతి కూడా హాజరు కాలేదు. ఒక్క విజయమ్మ మాత్రమే కనిపించారు.
అనంతపురంలో సిద్ధం సభ ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా సీఎం జగన్ సిద్ధం పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాప్తాడులో మూడో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనాల్సి ఉన్నందునే జగన్ వివాహానికి హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. కానీ నిశ్చితార్థ వేడుకల సమయంలో జరిగిన పరిణామాలతో కలత చెంది.. జగన్ పెళ్లికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థ సమయానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకోలేదు. ఆమె పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ తరుణంలోనే వైసీపీ శ్రేణులు సైతం షర్మిలను ప్రత్యర్థిగా చూడడం ప్రారంభించారు. చంద్రబాబుతో సమానమైన శత్రుత్వ భావనను షర్మిల ఏర్పరచుకున్నారు. దీంతో వివాహానికి హాజరు కావడం భావ్యం కాదని సన్నిహితులు చెప్పడంతో జగన్ ఆగిపోయారని టాక్ నడుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.