Alimony impact on men: కారణాలు ఏవైనా కావచ్చు.. తప్పు ఎవరిదైనా కావచ్చు.. అంతిమంగా విడాకులు అనివార్యం అయిన తర్వాత.. ఎవరి దారి వారు చూసుకోవడమే. ఒకవేళ పిల్లలు గలిగి.. నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉండి ఉంటే గనక పురుషుడు వారి జీవన భృతి కోసం డబ్బులు చెల్లించాలి. అందులో తప్పులేదు. తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఆడవాళ్లు పెంచినంత గొప్పగా మగవాళ్ళు పిల్లల్ని పెంచలేరు. అందువల్లే కోర్టులు భరణాలు చెల్లించాలని భర్తలకు ఆదేశాలు జారీచేస్తాయి. దీనిని ఆసరాగా చేసుకొని చాలామంది భార్యలు భరణాల కోసం భర్తలను డిమాండ్ చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాలలో చాలావరకు కేసులు ఇలాంటివే ఉన్నాయని తెలుస్తోంది.
భరణాలకు సంబంధించిన కేసులలో న్యాయస్థానాలు అనేక సందర్భాలలో చాలా విస్పష్టమైన తీర్పులు ఇచ్చాయి. ముఖ్యంగా భరణాల కోసం భర్తలను బలి పశువులను చేయకూడదని.. ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ భర్తలను హింసకు గురి చేయకూడదని న్యాయస్థానాలు తమ తీర్పులలో అభిప్రాయపడ్డాయి. అయినప్పటికీ చాలామంది మహిళలు మారడం లేదు. భరణాల కోసం లేనిపోని కేసులు నమోదు చేస్తూ.. గృహహింస.. ఇతర చట్టాలను ఆసరాగా తీసుకొని మగవాళ్ళను దారుణంగా హింసిస్తున్నారు. ఇటువంటి హింస తట్టుకోలేక చాలామంది భర్తలు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు భార్య భర్తల మధ్య మరణానికి సంబంధించిన కేసును విచారించిన తర్వాత.. కీలకమైన తీర్పును ప్రకటించింది. ఆ మహిళ నెలకు లక్షకు పైగా సంపాదిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయినప్పటికీ అతని నుంచి భరణం కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఈ నేపథ్యంలో తన పరిస్థితిని ఆ భర్త కోర్టు ఎదుట వెల్లడించాడు. పూర్వపరాలను పరిశీలించిన తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు కీలకమైన తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు కాస్తా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెలకు లక్షకు పైగా సంపాదించే భార్య భర్త నుంచి భరణాన్ని కోరడం దారుణమని హైకోర్టు అభిప్రాయపడింది. అది భర్త రక్త మాంసాలను లాక్కోవడానికి చేసే ప్రయత్నమని మండిపడింది. అంతేకాదు మధ్యంతర భరణాన్ని నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్ధించింది. అంతేకాదు ఈ తీర్పు వెల్లడిస్తూ.. ప్రఖ్యాత నవల రచయిత షేక్స్పియర్ రాసిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంతో పోల్చింది. ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో ఓ వ్యక్తి ఒకరి వద్ద అప్పు తీసుకుంటాడు. అప్పును తీర్చే మార్గం లేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వ్యక్తి.. తీసుకున్న వ్యక్తి శరీరం నుంచి పౌండు మాంసాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఈ కేసు కూడా దాదాపు అలానే ఉందని మధ్యప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది..
“మీరు నెలకు లక్షకు పైగా సంపాదించే స్తోమత కలిగి ఉన్నారు. అలాంటప్పుడు భర్త నుంచి భరణాన్ని ఎందుకు కోరుకుంటున్నారు.. ఇది అతడిని ఇబ్బంది పెట్టే పని. బతికి ఉండగానే నరకాన్ని చూపించాలని మీరు భావిస్తున్నారా.. భరణం కోరుకోవడం ఈ విషయంలో సరైన విధానం కాదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకుంటారని ఆశిస్తున్నామని” హైకోర్టు తన తీర్పులో ప్రకటించింది.
