JP vs JD: ఒకరు ఐఏఎస్.. మరొకరు ఐపీఎస్. వీరిద్దరు అధికారులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ప్రజల్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరు రాజకీయాల్లోకి వచ్చారు. మాజీలుగా మారిన ఆ ఇద్దరు అధికారులు మాత్రం రాజకీయంగా రాణించలేక పోతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో వీరి భవిష్యత్ ఏంటనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది.

ఇప్పటికే అర్ధమై ఉంటోంది.. ఆ ఇద్దరు అధికారులేవరోనని. వారిలో ఒకరు మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ(జేపీ), మరొకరు సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. వీరిద్దరు ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించి ఆ స్థానానికి వన్నెతెచ్చారు. ప్రభుత్వ యంత్రాంగానికి సలహాలు, సూచనలు చేస్తూ ప్రజా సేవలో ఎల్లప్పుడు ముందుండటంతో వీరికి ప్రజల్లో సొంతంగా ఇమేజ్ ఏర్పడింది.
రాజకీయాల్లోని చెత్తను ఏరిపారేయాలని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన జేపీ, జేడీలు ఆశించిన మేర రాణించడం లేదు. ముందుగా జయప్రకాశ్ నారాయణ గురించి చూస్తే.. లోక్ సత్తా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి జయప్రకాశ్ నారాయణ అడుగుపెట్టారు. కూకట్ పల్లి నుంచి ఒకసారి ఎమ్మెల్యే గెలుపొందారు. ఆ తర్వాత మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
లోక్ సత్తా పార్టీని సైతం స్వచ్చంధ సంస్థగా మార్చేశారు. ఈ సంస్థ ద్వారానే ప్రజా సమస్యలపై సర్వేలు చేస్తున్నారు. రైతులను కలుస్తూ వారి బాధలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాజకీయంగా మాత్రం ఆయన యాక్టివ్ గా ఉండటంలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక సీఐబీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విషయానికిస్తే.. రాజకీయాల్లో అనుకున్న విధంగా సక్సస్ కావడం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేసిన లక్ష్మీనారాయణ ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత జనసేనకు గుడ్ బై చెప్పారు. తనకు వైసీపీ, టీడీపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెబుతున్న జేడీ ప్రస్తుతం ఆయన ఏపార్టీలో చేరలేదు.
అప్పుడు విశాఖ సమస్యలపై పోరాటం చేస్తున్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా మాత్రం యాక్టివ్ గా కన్పించడం లేదు. జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాశ్ నారాయణలు టీవీ డిబేట్లలో మాత్రం ఎక్కువగా కన్పిస్తుంటారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో వీరి విశ్లేషణలుంటాయి. ప్రజా సమస్యలపై అపారమైన జ్ఞానం కలిగిన వీరిద్దరు మాత్రం రాజకీయంగా రాణించలేకపోవడం శోచనీయంగా మారింది. ఏదిఏమైనా వీరిద్దరి పరిస్థితి ఒకలా మారిందనే కామెంట్స్ విన్పిస్తుంది.
రాబోయే రోజుల్లో వీరిద్దరు రాజకీయంగా రాణిస్తారా? లేదంటే స్వచ్చంధ సేవా కార్యక్రమాలకే పరిమితం అవుతారా? అనే చర్చ నడుస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల్లో గెలుపొటములు సహజమనే విషయాన్ని వీరిద్దరు గ్రహించి రాజకీయంగా యాక్టివ్ గా ఉంటేనే భవిష్యత్ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరీ ఈ విషయాన్ని వీరిద్దరు ఏమేరకు సీరియస్ గా తీసుకుంటారో అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!