
తెలంగాణలో పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం జర్నలిస్టు రఘును పోలీసులు అరెస్ట్ చేసిన విధానం వీడియోల్లో చూసి అందరూ షాక్ అయిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా తెలంగాణ సర్కార్ ను అభాసుపాలు చేసింది.
ఎవరినైనా సరే ఓ వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే దానికో ప్రక్రియ ఉంటుంది. కిడ్నాపర్లుగా వచ్చి ఎత్తుకెళ్లిపోవడం ఎక్కడా లేదు. దీంతో పోలీసులు పరిధి దాటారన్న విమర్శలు వెల్లువెత్తాయి.
రఘును పోలీసులు అరెస్ట్ చేసింది తాజా కేసు ఏమీ కాదు.. హూజూర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా గుర్రంపోడులో బీజేపీ నేతలు గిరిజనుల భూములు ఆక్రమించారని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సమయంలో 18మంది బీజేపీ నేతలపై కేసులు పెట్టారు. కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టు రఘుపై కూడా కేసు పెట్టారు. బీజేపీ నేతలను వదిలేసిన పోలీసులు జర్నలిస్టు రఘును మాత్రం నల్గొండ జిల్లా నుంచి వచ్చి మరీ మల్కాజిగిరిలో నివాసం ఉండే జర్నలిస్టును అరెస్ట్ చేయడం ముక్కున వేలేసుకునేలా చేసింది.
నిజానికి అరెస్ట్ చేసేందుకు పోలీస్ డ్రెస్సులో అయినా రావాలి. సరే డ్రెస్ లేకుండా వచ్చినా పోలీసు వాహనాల్లోనే రావాలి. కానీ అవేవీ లేకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా ఓ ప్రైవేటు కారులో పట్టుకోవడం ఏంటనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్న రఘుపై కావాలనే కక్షసాధింపు చర్యలతో అరెస్ట్ లు చేశారని జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. ఓ జర్నలిస్టును ఇలా పట్టుకుపోయినా కూడా జర్నలిస్ట్ సంఘాలు నోరు మెదపకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక జర్నలిస్టు విషయంలో సంఘాలు వ్యవహరిస్తున్న తీరు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. జర్నలిస్టుల హక్కులు కాపాడాల్సిన సంఘాలు ఇలా మౌనంగా ఉండడం ఏంటని అందరూ నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.