రాష్ట్రంలో వివిధ కేసుల్లో తెలుగు దేశం పార్టీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇ.ఎస్ ఐ కేసులో నిన్న మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అరెస్టు చేసిన సంగతి విదితమే. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా బిఎస్-౩ వాహనాలను తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేసి బిఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిని అనంతపురం పోలీసులు శంషాబాద్ లో శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వీరిని శంషాబాద్ నుంచి అనంతపురం తరలిస్తున్నారు.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే బిఎస్-3 వాహనాల విక్రయాలకు గడువు ముగియడంతో అశోక్ లైలాండ్ సంస్థ తాన వద్ద ఉన్న 154 లారీ చాసిస్ లను రద్దు (తుక్కు) రూపంలో విక్రయించేందుకు సిద్ధం అయ్యింది. వాటిని కొనుగోలు చేసిన జేసీ కుటుంబం బిఎస్-4 వాహనాలుగా దొంగ రిజిస్ట్రేషన్ లు చేయించాయి. రాష్ట్రంతో పాటు నాగాలాండ్, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో వీటిని రిజిస్ట్రేషన్ చేయించారు. లారీ చాసిస్ లను ఉపయోగించి బస్సులను తయారు చేశారు. అదేవిధంగా జెసి కుటుంబం వద్ద ఈ వాహనాలను కొనుగోలు చేసిన కొందరు మోసపోయామని గ్రహించి అనంతపురంలో ఆయన ఇంటి వద్ద ఇటీవల ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన రవాణా శాఖ పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేయడంతో తాడిపత్రిలోని జేసీ నివాసానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.