Janasena Veera Mahilalu: పవన్.. ఈ మాట వింటేనే ఒక పూనకం. అభిమానుల్లో ఒక వైబ్రేషన్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న మరో హీరో లేరంటే అతిశయోక్తి కాదు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఈ అభిమానులంతా ఓటర్లుగా మారలేకపోయారన్న ఒక అభిప్రాయం ఉంది. జనసేన కార్యకర్తలుగా టర్న్ కాలేకపోయారన్న అపవాదు ఒకటి ఉంది. అయితే ఇప్పటివరకూ ఒక ఎత్తు.. ఇక నుంచి ఒక ఎత్తు అని అటు పవన్ అభిమానులు, జన సైనికులు చెబుతున్నారు. అసలు సిసలు రాజకీయం చూపుతామని హెచ్చరిస్తున్నారు. అంతా సంఘటితమై.. సమాజాన్ని చైతన్యవంతం చేసి పవన్ ను అత్యున్నత పీఠంపై కూర్చోబెడతామని ప్రతిన బూనుతున్నారు. అటు పవన్ సైతం గత ఎన్నికల్లో తన వెంట వచ్చిన అభిమానులను చూసి పొంగిపోయానని.. కానీ ఎన్నికల ఫలితాల తరువాతే తెలిసిందని.. వారు అభిమానులే తప్ప కార్యకర్తలు కారన్న విషయం తెలుసుకున్నానంటూ వ్యక్తం చేసిన ఆవేదన బాగానే వర్కవుట్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే పవన్ వెంట మేము సైతం అంటూ వీర మహిళలు ముందుకొస్తున్నారు. పవన్ పై అధికార పక్షం ఏ చిన్న విమర్శ చేసినా తట్టుకోలేకపోతున్నారు. ఇటీవల జనసేన ప్రచార రథం వారాహిపైనా, పవన్ మార్షల్ ఆర్ట్స్ పై విమర్శలకు దిగిన మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్ కు గట్టి కౌంటరే ఇస్తున్నారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విశాఖ జిల్లాలో వీర మహిళలు ఇద్దరు మంత్రుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఆ మంత్రులిద్దరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారాహి వాహనం సప్త మాతృకల్లో ఒకటని.. అటువంటి పేరు పెట్టడాన్ని ఆహ్వానించాల్సింది పోయి ఒక మహిళ మంత్రి అయిన రోజా దిగజారుడుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగులు గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదన్నారు. ఆమె ఏ రంగు పార్టీ నుంచి వచ్చారో.. ఏ రంగు పార్టీలో ఉన్నారో తెలుసుకొని మాట్లాడాలని సవాల్ చేశారు. గత మూడున్నరేళ్లుగా 51 శాతం పెరిగిన మహిళలపై అకృత్యాలు గురించి మాట్లాడగలరా అని ప్రశ్నించారు. తాను సమావేశానికి హాజరైన సాటి మహిళ ఒంటిపై ఉన్న చున్నీలు తీసిన కుసంస్కారం గురించి మాట్లాడగలరా అని నిలదీశారు. సీఎం జన్మదిన వేడుకల్లో నర్తకిగా మారి పదవి ఔన్నత్యాన్ని చెడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వారాహిని నారాహి అని మార్చాలన్న ఆమె సూచనపై మండిపడ్డారు. పవన్ 175 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పెట్టాలన్న సూచనపై ఫైర్ అయ్యారు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులకు 175 నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. పక్క పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చినా మీరా.. మా నాయకుడికి సవాల్ చేసేది అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

అటు సొంత జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీరును కూడా విశాఖ వీర మహిళలు ఎండగట్టారు. వారాహి వాహనం రిజిస్ట్రేషన్ గురించి అవాకులు, చెవాకులు పేలుతున్న అమర్నాథ్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పవన్ తనతో ఫొటో దిగడానికి వచ్చారని చెప్పిన నాడే ఆయన తెలివితేటలు తెలిసిపోయాయన్నారు. కనీసం రిజస్టర్ వాహన నంబర్లను ఎలా పరిగణిస్తారో తెలియని వ్యక్తి కేబినెట్ లో కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. వాహనానికి అలిండియా పర్మిషన్ ఎలా ఇస్తారో? వాటికి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారో? తెలియని స్థితిలో మంత్రి ఉండడం బాధాకరమన్నారు. పక్క రాష్ట్రంలో వైసీపీ నాయకులకు వాహనాలు లేవా అని ప్రశ్నించారు. అవన్నీ ఏపీలో తిరగడం లేదా అని కూడా నిలదీశారు. నాడు ఎన్టీఆర్ చైతన్య రథం, బీజేపీ నేత ఎల్ కే అద్వానీ ప్రచార రథంతో పార్టీని అధికారంలోకి తేవగలిగారని.. ఇప్పుడు పవన్ అదే పనిచేస్తుండడంతో వారికి మింగుడు పడడం లేదని చెప్పుకొచ్చారు. అయితే వీర మహిళంతా అలివ్ గ్రీన్ చీరలు ధరించి నిరసన తెలపడం, ఆ ఇద్దరు మంత్రులను టార్గెట్ గా చేసుకొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జనసైనికులు, పవన్ అభిమానులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మంత్రులు రోజా, అమర్నాథ్ లు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.