Janasena, TDP alliance: పొత్తు సమన్వయం పై జనసేన, టిడిపి ఫోకస్ పెంచాయి. రెండు పార్టీలు సమన్వయ కమిటీలను నియమించాయి. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ టిడిపి తో పొత్తు ప్రకటన చేశారు. తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం విశేషం. రెండు పార్టీల కమిటీలు యాక్షన్ ప్లాన్ లోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత వైసిపి కి మైండ్ బ్లాక్ అయింది. చంద్రబాబును అరెస్టు చేశామన్న ఆనందం ఆవిరైంది. దీంతో రెండు పార్టీల పొత్తుపై విష ప్రచారానికి వైసీపీ సోషల్ మీడియా, ప్రో వైసిపి బ్యాచ్ దిగింది. వైసీపీతో అంతర్గతంగా పనిచేస్తున్న చాలామంది పొత్తుపై రకరకాల కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై పవన్ మాట్లాడుతూ.. పొత్తు విచ్చిన్నానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయని.. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.అటు నాగబాబును సైతం రంగంలోకి దించారు.జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి.. పొత్తుల విషయంలో అధినేత మాటే ఫైనల్ అని.. ఎవరూ మాట్లాడ వద్దని నాగబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. మరోవైపు రెండు పార్టీల మధ్య పొత్తుపై విష ప్రచారం నింపడానికి వైసిపి సోషల్ మీడియా గట్టిగానే పనిచేస్తుంది. ఏకంగా టీవీ9 జర్నలిస్ట్ రజినీకాంత్ రావు తో సజ్జల భార్గవ్ ఇందుకు గాను చర్చలు జరిపినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది.
మరోవైపు ఎన్నికల సమీపిస్తుండడంతో రెండు పార్టీల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్నారు. అందుకే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య సభ్యులుగా టిడిపి ఒక సమన్వయ కమిటీని ప్రకటించింది. ఇంతకుముందే పవన్ కళ్యాణ్ జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో.. బి మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, పాలవలస యశస్విని, బొమ్మిడి నాయికర్లతో కూడిన కమిటీని ప్రకటించారు.
చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైన అంశాలపై పార్టీ అధినేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు పార్టీల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు, కలిసి పోరాటాలు చేయడం వంటి సమస్యల పైన సమన్వయ కమిటీలు ఎప్పటికప్పుడు చర్చలు జరపనున్నాయి.సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నాయి. మొత్తానికైతే టిడిపి, జనసేన ఎన్నికల క్షేత్రానికి అన్ని విధాల సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. అధికార వైసీపీని కలవరపెడుతున్నాయి.