Homeఆంధ్రప్రదేశ్‌Janasena: జనసేన సభా ప్రాంగణానికి ‘దామోదరం సంజీవయ్య’ చైతన్య వేదికగా నామకరణం

Janasena: జనసేన సభా ప్రాంగణానికి ‘దామోదరం సంజీవయ్య’ చైతన్య వేదికగా నామకరణం

పేద దళిత కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి వెళ్లి, రాజకీయాల్లో కడవరకు నీతి, నిజాయితీలతో బతికిన మహోన్నత వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలనే సంకల్పంతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రాంగణానికి “శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక”గా నామకరణం చేశారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ భవిష్యత్తు కార్యచరణ ప్రకటించడం కోసం ఒక రాజకీయ పార్టీగా సభను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇన్ని ఇబ్బందులు, ఆటంకాలు కల్పించడం చాలా దురదృష్టకరమన్నారు. గత నెల 28వ తేదీన సభకు అనుమతి, బందోబస్తు కోసం డీజీపీ కార్యాలయానికి లెటర్ రాస్తే ఇప్పటి కి అనుమతి లభించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… “ సభకు చక చక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ నిర్వహణకు 12 కమిటీలు నియమించుకున్నాం. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కోసం లక్షలమంది తరలివస్తారని తెలిసీ ప్రభుత్వం సృష్టిస్తోన్న ఆటంకాలు వర్ణనాతీతం. రాజకీయ ఒత్తిళ్లతో సభ కోసం ఇప్పటికే మూడు ప్రాంతాలు మార్చుకోవాల్సి వచ్చింది. చివరకు మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామస్థులు పెద్ద మనసుతో సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చారు. వారికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.

*ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా సభను విజయవంతం చేస్తాం
ఆవిర్భావ సభకు సహాయ, సహకారాలు అందించాలని కోరుతూ గత నెల 28న డిజీపీ కార్యాలయానికి ఉత్తరం అందించాం. లెటర్ ఇచ్చి10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అటునుంచి ఎటువంటి సమాధానం రాలేదు. సభకు అనుమతుల కోసం మా పార్టీ నాయకులు అనేక మంది పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఫోన్లు చేశారు, ఇ మెయిల్స్ పంపించారు. జిల్లా ఎస్పీ గారిని కలవడానికి వెళితే నాలుగు గంటలు వెయిట్ చేయించి కలవకుండానే వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టినా ఎక్కడ నుంచి కూడా కనీస స్పందన రాలేదు. నిన్న మొన్నటి వరకు పోలీస్ శాఖ నుంచి స్పందన వస్తుందని ఎదురు చూశాం. ఇప్పటికీ రాకపోవడంతో పార్టీ పెద్దలతో చర్చించాం, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాం.అందరి సలహా మేరకు సభకు అనుమతులు కోసం రేపు హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించుకున్న ట్లు అనుమతి రాకముందు మీడియాతో మాట్లాడుతూ మనోహర్ గారు అన్నారు. మా పార్టీ నాయకులు, జనసైనికులు, వాలంటీర్లు ఉన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు 12 కమిటీలు పనిచేస్తాయి. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సభను విజయవంతం చేసుకుంటాం.

*జనసైనికులతో పెట్టుకోవద్దు
పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయిలో బలోపేతం, ముందుముందు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం వంటి అంశాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ శ్రేణులకు వివరించడం కోసం సభను ఏర్పాటు చేసుకుంటే దానికి ఇన్ని ఆటంకాలు సృష్టించడం బాధాకరం. మొండి వైఖరి, విపరీత ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశించాం. అది ఎక్కడ కూడా కనిపించలేదు. ప్రభుత్వంలో చాలా మంది అనుభవజ్ఞులైన పెద్దలు ఉన్నారు. అధికార యంత్రాంగం ఉంది. మీలాంటి పెద్దలైనా చొరవ చూపించి సభకు ఆటంకాలు సృష్టించకుండా… సభ సజావుగా, శాంతియుతంగా జరిగేటట్లు ఒక ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. పాలకులకు మరోసారి చెబుతున్నాం. జనసైనికులు, వీరమహిళలతో పెట్టుకోకండి. మా పార్టీలో వాళ్లే బలమైన శక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలు, యువత ఎదురు చూస్తున్నారు.

*సినీ పెద్దలు ప్రజల తరఫున నిలబడాలి
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోందో అర్ధం కావడం లేదు. సినిమా పరిశ్రమలో విజయం అనేది ప్రజలపై ఆధారపడి ఉంటుంది. సినిమా బాగుంటే ఒకటికి నాలుగు సార్లు చూస్తారు. లేకపోతే ఒక్కసారి చూసి వదిలేస్తారు. ముఖ్యమంత్రి ఆలోచన వైఖరి విచిత్రంగా అనిపిస్తోంది. ప్రజలు పేదవాళ్లు అని చెప్పి వకీల్ సాబ్ సినిమా అప్పుడు టికెట్ రేట్లు తగ్గించిన ఆయన… ఇప్పడు ప్రజలంతా ధనవంతులు అయిపోయారో, లేక అప్పు తెచ్చిన రూ.7 లక్షల కోట్లతో వారిని ధనవంతులను చేశారో తెలియదు గానీ సినిమా టికెట్ల రేట్లు పెంచుతున్నామని జీవో ఇచ్చారు. దీనికి ముఖ్యమంత్రి గారిని సినీ పెద్దలు సన్మానించాలని నిర్ణయించడం విని ఆశ్చర్యమేసింది. దేనికోసం ఈ సన్మానం చేస్తున్నారో వివరించాలి. ముఖ్యమంత్రి తీరుతో అన్ని వర్గాలకు అపార నష్టం జరిగింది. సంక్షేమం పేరుతో విపరీతంగా దోపిడీ జరిగింది. సినీ పెద్దలు వైఖరి మార్చుకొని రాష్ట్ర ప్రజల తరపున నిలబడాలి. మీలాంటి వారికే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.

*ముఖ్యమంత్రిగా పనిచేసిన  రోశయ్య గారి సంతాప తీర్మానం పెట్టరా?
శాసనసభ వ్యవహారాలు చూస్తే బాధ కలుగుతోంది. సభలో ప్రతిపక్షాలకు ఎలా సమాధానం‌ చెప్పాలో శ్రీ రోశయ్య గారిని చూసి నేర్చుకోవాలి. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంతాప తీర్మానం పెట్టకపోవడం విచారకరం. ఈ సమావేశాలు ముగిసే లోపు ఆయనకు నివాళులు అర్పించాలి. అటువంటి నాయకుల గురించి సభలో చర్చించాలి. నేటి తరం ప్రజాప్రతినిధులకు రోశయ్య గారి పని తీరు వివరించాలి. దీనిపై ముఖ్యమంత్రి స్పందించాలని జనసేన తరపున విజ్ఞప్తి చేస్తున్నామని” అన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular