Jagan vs Janasena : ఏపీ సీఎం జగన్ ఇదివరకు ఏ ప్రసంగాల్లో అయినా టీడీపీ అధినేత చంద్రబాబును ప్రస్తావించేవాడు.. తిట్టిపోసేవాడు. ఆయన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గురించి వచ్చేది కాదు. కానీ ఈ మధ్య ప్రసంగాల్లో చంద్రబాబును తగ్గించి పవన్ ను తిడుతున్నాడు.. ‘దత్తపుత్తుడు’, చంద్రబాబు బంటు అంటూ పవన్ ఎదుగుదలను గుర్తించాడు. ఇక తాజాగా నరసాపురంలోనూ జనసేనకు కొత్త పేరు పెట్టారు జగన్. దీన్ని బట్టి ఆయన జనసేన ఉనికికి భయపడుతున్నట్టుగా అర్థమవుతోంది.

జనసేనపై నరసాపురంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ‘జనసేనను’ రౌడీసేన అంటూ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో దాడులు, రౌడీయిజంతో పెట్రేగిపోతున్న వైసీపీ ముందు.. అస్తిత్వం కోసం పోరాడుతున్న జనసేన పోరాటం ప్రజల పక్షాన ఉంటోంది. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేయడం.. బాధితులను నిరాశ్రయులను చేయడం ‘హీరోయిజమా?’ లేక వారి తరుఫున పోరాడుతున్న జనసేనది రౌడీయిజమా అన్నది జగన్ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, వీర మహిళలు, జనసైనికులను జగన్ కించపరిచాడు. సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయనలోని అసహనం, ఆందోళనకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసినప్పుడు.. మత్స్యకారులకు మోసం చేసినప్పుడు .. పేదల ఇళ్లను కూలగొట్టినప్పుడు.. కౌలు రైతులను దగా చేసినప్పుడు.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేనప్పుడు..? ఎవరిది రౌడీ సేన అంటూ తాజాగా నాదెండ్ల ప్రశ్నించారు. వీరందరినీ ఆదుకున్న జనసేన రౌడీసేన ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.
ఏపీలో దారుణాతి దారుణంగా రౌడీయిజం చేస్తున్న వైసీపీ అధినేత ఆయనే జనసేనను అలా అనడం విడ్డూరంగా ఉందని జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారు. అన్యాయంపై పోరాడినందుకు జనసైనికులను రౌడీలను చేసినా భరిస్తాం.. ప్రజల కోసం పోరాడుతామని స్పష్టం చేస్తున్నారు.