నాడు అసెంబ్లీ.. నేడు పంచాయితీ.. టీడీపీకి జనసేన భారీ దెబ్బ!

‘‘రాష్ట్రంలో వామ‌ప‌క్షాల‌కు అధికారం సాధించుకునేంత బ‌లం లేక‌పోవ‌చ్చు.. కానీ, అధికార పార్టీని ఓడించగలిగే సత్తా మాత్రం ఖచ్చితంగా ఉంది’’ అనేవారు అప్పట్లో లెఫ్ట్ నేతలు. ఇప్పుడు ఈ మాటను అక్షరాలా చేసిచూపెడుతోంది జనసేన. అయితే.. పవన్ పార్టీ టీడీపీని మాత్ర‌మే దెబ్బతీస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నా.. తాజా పంచాయ‌తీ రిజ‌ల్ట్స్ ను ప‌రిశీలించినా.. ఇదే స‌త్యం బోధ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం! Also Read: ఏపీలో మరో పంచాయతీ పోరు : […]

Written By: Bhaskar, Updated On : March 3, 2021 4:20 pm
Follow us on


‘‘రాష్ట్రంలో వామ‌ప‌క్షాల‌కు అధికారం సాధించుకునేంత బ‌లం లేక‌పోవ‌చ్చు.. కానీ, అధికార పార్టీని ఓడించగలిగే సత్తా మాత్రం ఖచ్చితంగా ఉంది’’ అనేవారు అప్పట్లో లెఫ్ట్ నేతలు. ఇప్పుడు ఈ మాటను అక్షరాలా చేసిచూపెడుతోంది జనసేన. అయితే.. పవన్ పార్టీ టీడీపీని మాత్ర‌మే దెబ్బతీస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నా.. తాజా పంచాయ‌తీ రిజ‌ల్ట్స్ ను ప‌రిశీలించినా.. ఇదే స‌త్యం బోధ‌ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం!

Also Read: ఏపీలో మరో పంచాయతీ పోరు : ఆ స్థానాలేంటో తెలుసా

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ప‌రాభ‌వానికి గురైంది. 175 స్థానాలున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికార పార్టీగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన టీడీపీ గెలుచుకున్న‌ది కేవ‌లం 23 స్థానాలు. వైసీపీ ఏకంగా 151 నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌య‌బావుటా ఎగ‌రేసింది. ఇక‌, జ‌న‌సేన పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. ఈ ఫ‌లితాల ద్వారా టీడీపీని జ‌గ‌న్ పార్టీ కోలుకోలేకుండా దెబ్బ‌తీసింద‌ని అర్థ‌మ‌వుతోంది. కానీ.. జ‌న‌సేన కూడా క‌నిపించ‌ని రీతిలో దెబ్బేసింద‌న్న విష‌యం ఫ‌లితాల‌ను విశ్లేషించిన వారికి మాత్ర‌మే బోధ‌ప‌డింది.

అవును.. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ 5 వేల ఓట్ల లోపు ఓడిపోయిన స్థానాలు ఏకంగా 28 ఉన్నాయి. వీటిల్లో జ‌న‌సేన పార్టీకి వ‌చ్చిన ఓట్లు 60 వేల నుంచి 6 వేల వ‌ర‌కు ఉన్నాయి. ఇవ‌న్నీ.. టీడీపీకి ప‌డాల్సిన ఓట్లేన‌ని విశ్లేషించారు అప్ప‌ట్లో. జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్ల‌లో అధికార పార్టీ వ్య‌తిరేక ఓటు కొద్దోగొప్పో ఉన్నా.. మిగిలిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకి చెందాల్సిన‌వే అన్న‌ది విశ్లేష‌కుల మాట‌. ఆ ఓట్ల‌ను జ‌న‌సేన చీల్చ‌డం ద్వారా.. వైసీపీ భారీ విజ‌యాన్ని ద‌క్కించుకోగ‌లిగింద‌ని పోస్టుమార్టం చేశారు.

తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థం కేవ‌లం 708 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థికి 12,315 ఓట్లు వ‌చ్చాయి. ఇక్క‌డ జ‌న‌సేన లేకుంటే.. ఖ‌చ్చితంగా ఈ సీటు టీడీపీదేన‌నే అభిప్రాయం వ్య‌క్తమైంది. య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థికి 4 వేల ఓట్ల మెజారిటీ రాగా.. అక్క‌డ జ‌న‌సేన‌కు 16,500 ఓట్లు వ‌చ్చాయి. ఇవి కూడా టీడీపీకి ప‌డేవేన‌ని అన్నారు. ఇలాంటి నియోజక‌వ‌ర్గాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఈ విధంగా జ‌న‌సేన కూడా ప‌రోక్షంగా టీడీపీ దారుణ ఓట‌మికి కార‌ణ‌మైంద‌న్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.

Also Read: ఓదార్పు యాత్రకు రెడీ అయిన బాబు

అయితే.. ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింద‌ని అంటున్నారు. నిజానికి ఇవి పార్టీ ర‌హిత ఎన్నిక‌లు అయిన‌ప్ప‌టికీ.. పోటీచేసిన వారంతా అన‌ధికారికంగా ఆయా పార్టీల అభ్య‌ర్థులే అన్న సంగ‌తి తెలిసిందే. ఇవి పార్టీల‌ ఎన్నిక‌లు కానందున‌.. గెలుపు లెక్క‌లు ఎవ‌రికి వారు చెప్పుకున్నారు. అయితే.. అధికార పార్టీ ఏక‌ప‌క్షంగా స‌ర్పంచ్ ల‌ను గెలుచుకుంద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. కానీ.. సంఖ్య ద‌గ్గ‌రికి వ‌చ్చే స‌రికి ఎవ‌రికి వారు త‌మ‌వైపు త‌క్కెడ కాస్త‌ తూగేలా చూసుకున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మాత్రం ఆర్డీవోల నుంచి తీసుకున్న స‌మాచారం ప్ర‌కారం అని అధికారికంగా ఫ‌లితాల‌ వివ‌రాలు వెల్ల‌డించారు. వాటి ప్ర‌కారం.. రాష్ట్రంలో మొత్తం 13,095 సర్పంచ్ స్థానాలు ఉండగా.. వాటిలో 10,524 స్థానాలను వైసీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. అంటే.. 80.37 శాతం స్థానాల్లో వైసీపీ జ‌య‌కేతనం ఎగ‌రేసింది. ప్రతిపక్ష టీడీపీ బ‌ల‌ప‌రిచిన అభ్య‌ర్థులు 2,063 స్థానాల్లో గెలిచారు. అంటే.. 15.75 శాతం స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఇక, ఇతరులు 488 మంది స్థానాల్లో (3.88 శాతం) విజ‌యం సాధించారని పెద్దిరెడ్డి చెప్పారు. అయితే.. జ‌న‌సేన త‌మ లెక్కలు విడుద‌ల చేసింది. ఈ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో తాము 1209 సర్పంచ్ పదవులు, 1,776 ఉపసర్పంచ్ పదవులు, 4,456 వార్డు ప‌ద‌వులను జనసేన మద్దతుదారులు గెలుపొందార‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

అయితే.. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయిన ప‌లు స్థానాల‌ను ప‌రిశీలిస్తే.. అసెంబ్లీ ఫ‌లితాలు గుర్తుకు వ‌స్తున్నాయంటున్నారు విశ్లేష‌కులు. చాలా చోట్ల టీడీపీ కోల్పోయిన మెజార్టీకి.. జ‌న‌సేన‌కు వ‌చ్చిన ఓట్ల‌కు స్వల్ప తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో.. పంచాయ‌తీ పోరులోనూ జ‌న‌సేన టీడీపీని దెబ్బ‌తీసింద‌నే విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఈ విధంగా.. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే.. అధికార పార్టీతోపాటు ప‌వ‌న్ పార్టీని చూసికూడా చంద్ర‌బాబు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చిందంటున్నారు. మ‌రి, రానున్న రోజుల్లో ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో చూడాలి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్