Pawan Kalyan-Chandrababu: ఇటీవల కుప్పం నియోజకవర్గ పర్యటనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జనసేనతో పొత్తు గురించి చేసిన వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. వన్ సైడ్ లవ్ అయితే సరిపోదని చెప్తూనే తాను జనసేనతో పొత్తుకు సిద్ధమే అన్నట్లుగా చంద్రబాబు ఇన్ డైరెక్ట్ సంకేతాలు అయితే పంపారు. కాగా, ఆ ప్రపోజల్‌కు రిటర్న్ ప్రపోజల్ జనసేన నుంచి వచ్చింది. కానీ, షరతులు అయితే జనసేన విధించింది.
జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎంగా ప్రకటించే దమ్ము చంద్రబాబుకుందా అంటు చాలెంజ్ చేశారు. గతంలో అనగా 2014లో రాష్ట్రం కోసం పవన్ కల్యాణ్ బేషరతుగా చంద్రబాబుకు మద్దతిచ్చి సీఎంను చేసిన విషయాన్ని బొలిశెట్టి గుర్తుచేశారు. ఈ క్రమంలోనే రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి పొత్తు గురించి మాట్లాడాలని సవాల్ చేశారు.
Also Read: పవన్ ‘భవదీయుడు భగత్ సింగ్’ పై క్రేజీ అప్ డేట్
టీడీపీ అధినేత బాబును ఈ విధంగా చాలెంజ్ చేస్తూనే మరో వైపు బాబుపై పలు ఆరోపణలు చేశారు బొలిశెట్టి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబు కూడా రాష్ట్ర ద్రోహియేనని విమర్శించారు. అవినీతి టీడీపీ, అరాచక వైసీపీ నుంచి ఏపీ రాష్ట్రానికి విముక్తి కావాలంటే జనాలే జనసేన పార్టీని గెలిపించాలని, ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మద్దతు కంటే ప్రజల మద్దతు ముఖ్యమని అన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం వైసీపీ వారు అఖిల పక్ష సమావేశం నిర్వహించడం లేదని ఈ సందర్భంగా బొలిశెట్టి విమర్శించారు. గతంలో చంద్రబాబు వ్యవహరించిన మాదిరిగానే ప్రస్తుతం జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు బొలిశెట్టి. అలా ఇరు పార్టీలు వైసీపీ, టీడీపీలను జనసేన నేత బొలిశెట్టి తీవ్రంగానే విమర్శించారు. ఇక చంద్రబాబు బొలిశెట్టి వ్యాఖ్యలపై, చాలెంజ్‌పై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న సంగతి అందరికీ విదితమే. కాగా, ఒకవేళ టీడీపీ పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్‌గా బీజేపీతోనూ పొత్తులో ఉండాల్సిందేనని పలువురు అంటున్నారు.