
Janasena 10th Anniversary : మరో కొద్ది గంటల్లో సంచలనాలు నమోదుకానున్నాయి. మాటల తూటాలు పేలనున్నాయి. రాజకీయ ప్రకంపనలు రేగనున్నాయి. ఇందుకు మచిలీపట్నం వేదిక కానుంది. జనసేన పదో ఆవిర్భావ సభకు మచిలీపట్నం ముస్తాబైంది. సువిశాల ప్రాంగణంలో సభా వేదిక ఏర్పాటుచేశారు. దీనికి పొట్టి శ్రీరాములు ప్రాంగణంగా నామకరణం చేశారు. ఏపీ నుంచే కాకుండా తెలంగాణ నుంచి జనసేన అభిమానులు భారీగా తరలిరానున్నారు. లక్షలాది మంది హాజరుకానుండడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. మొత్తం 10 రకాల కమిటీలను ఏర్పాటుచేసి ఆ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారు. గత కొద్దిరోజులుగా వందలాది మంది జనసైనికులు ఆవిర్భావ సభ ప్రాంగణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరికొద్ది గంటల్లో ఆవిర్భావ సభ జరగనుంది.
అయితే పదో ఆవిర్భావ సభకు మచిలీపట్నాన్ని ఎంపిక చేయడం అధికార పార్టీకి షాక్ కు గురిచేసింది. ఇక్కడ మాజీ మంత్రి పేర్నినాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పవన్ పై విమర్శలు చేయడంలో నాని ముందుంటారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తూలనాడడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ పేర్ని నానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే పదో ఆవిర్భావ సభను ఇక్కడ ఏర్పాటుచేశారు. పేర్ని నానిని టార్గెట్ చేస్తూ పవన్ కామెంట్స్ చేసే అవకాశముంది. ఇప్పటికే అమరావతి చేరుకున్న పవన్ గత మూడు రోజులుగా బిజిబిజీగా గడుపుతున్నారు. వివిధ సామాజికవర్గాల నాయకులతో పాటు పార్టీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు.
అయితే పదో ఆవిర్భావ సభలో వారాహి వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తొలుత మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి వారాహి వాహనంలో పవన్ బయలుదేరుతారని భావించారు. కానీ షెడ్యూల్ మారింది. మధ్యాహ్నం 12.30లకు విజయవాడలోని నోవాటెల్ హోటల్ నుంచి బయలుదేరుతారు. ఒంటి గంటకు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనంలో ఆవిర్భావ సభకు బయలుదేరుతారు. తాడిగడప జంక్షన్ , పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్ ,పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా కాన్వాయ్ సాగుతుంది. సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి పవన్ చేరుకోనున్నారు.
ఆవిర్భావ సభ వేదికపై కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతు భరోసా యాత్ర చేపట్టి పవన్ ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 3 వేల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున అందించడానికి నిర్ణయించారు., ఇప్పటికే చాలా జిల్లాల్లో పర్యటించి అందించారు. మిగిలి ఉన్నవారికి ఆవిర్భావ సభలో అందించనున్నారు. ఇందుకు జనసేన వర్గాలు ఏర్పాట్లు చేశాయి..