
H3N2 virus : కరోనా మహమ్మారితో రెండేళ్లపాటు ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బయట పడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు తిరిగి పాత పద్ధతుల్లోకి వచ్చేసారు. చేతులు కడుక్కోవడం, శానిటైజేషన్ చేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం వంటివి మర్చిపోయారు. తుమ్మినా, దగ్గినా మొహానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకునే అలవాటు పోయింది. కోవిడ్ కి ముందు రోజులను ఇప్పుడిప్పుడే అనుభవిస్తున్న ప్రజలను మరో విపత్తు తాజాగా భయపెడుతోంది. ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ రూపంలో మరో మహమ్మారి మానవులపైకి వచ్చేసింది. ఇది ఇన్ ఫ్లూయెంజా జాతికి చెందిన హెచ్3ఎన్2 వైరస్ గా నిపుణులు చెబుతున్నారు.
జోరుగా కేసుల నమోదు
దేశంలో హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వేలాది మంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ వైరస్ వారిలో జ్వరం, తీవ్రమైన దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి వంటివి రోజులు తరబడి వేధిస్తున్నాయి. ఊపిరితిత్తులను పీల్చి పిప్పి చేసే కరోనాకు సంబంధించిన కామన్ లక్షణం ఈ వైరస్ లోను కనిపిస్తుండడం గమనార్హం. కరోనా కేసులు తగ్గిన తర్వాత ఇప్పుడు భారత్ లో ఈ రకం వైరస్ బారినపడే వారి సంఖ్య ఎక్కువ అయిందని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలు అప్రమత్తం చేసింది. సాధారణ జలుబులు జ్వరం లాగే దీని కూడా లైట్ తీసుకున్నారు చాలామంది కానీ మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలను హెచ్చరించింది.
సీజన్ నుండి సీజన్ కు మారేటప్పుడు..
ఫ్లూ జాతికి చెందిన వైరస్ లు వాతావరణంలోనే ఉంటాయి. ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారే సమయంలో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ఈ ఫ్లూ వైరస్ లు యాక్టివ్ అవుతుంటాయి. ఇవి యాక్టివ్ అయిన సమయంలో ఈ వైరస్ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ తరహా లక్షణాలు ఐదు రోజుల నుంచి వారం రోజుల్లో తగ్గిపోతుంటాయి. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న హెచ్3 ఎన్ 2 రకం వైరస్ గత వైరస్లకు భిన్నంగా బలంగా ఉండడంతో ఈ లక్షణాలు రెండు నుంచి నాలుగు వారాలపాటు వేధిస్తున్నాయి. ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి పెద్దగా లేకపోయినప్పటికీ వైరస్ బారిన పడిన వారిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు.
-మరణాలతో ఆందోళన..
ఈ వైరస్ బారిన పడి తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన ఉదయ్ కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికంటే ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో రెండు మరణాలు నమోదు అయ్యాయి. ఈ మరణాలతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడంతో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఎప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హెచ్3ఎన్2 వైరస్ జాడ కనిపించినట్లు అధికారులు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 19 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ జలుబు వచ్చిన ఏమాత్రం ఏమరపాటు తగదని, వారం రోజులకు మించి మందులు వాడుతున్న తగ్గకపోయినట్లయితే వైద్యులను సంప్రదించాలని విపుణులు సూచిస్తున్నారు. కరోనా అంత తీవ్రత లేకపోయినప్పటికీ ఈ వైరస్ విషయంలోనూ అలసత్వం వద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపిస్తున్నారు