Muthireddy Yadagiri Reddy: నియోజకవర్గాలకు సుప్రీమ్ ల ను చేసిన తర్వాత ఒక్కో ఎమ్మెల్యే నియంతలైపోయారు. దానిని చూసి కేసిఆర్ ఇప్పుడు తల పట్టుకోవచ్చు గాక.. ఇలాంటి వారి తోకలు ఎలా కట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండవచ్చు గాక.. కానీ పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయింది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఎదుగుతోంది, బిజెపి కాలర్ ఎగరేస్తోంది.. అంటే దానికి కెసిఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ కారణమే. ఎమ్మెల్యేలకు బీభత్సమైన బాధ్యతలు అప్పగించడం ఇందులో ప్రధానమైనది. ఏ పోలీస్ స్టేషన్ కు ఎవరు ఎస్ఐగా రావాలో, ఏ అధికారి రెవెన్యూ ఆఫీసర్ గా ఉండాలో మొత్తం వాళ్ళ ఇష్టమే. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పై అనుచితంగా ప్రవర్తిస్తాడు.. ఇంకో ఎమ్మెల్యే అటవీ అధికారులను కొట్టమని గిరిజనులకు పిలుపునిస్తాడు. మరొక ఎమ్మెల్యే అడ్డగోలుగా ఇసుక దందా చేస్తాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఒక్క ముక్కలో చెప్పాలంటే నియోజకవర్గం ఎమ్మెల్యేలకు కేసీఆర్ సామంత రాజ్యాలు చేశారు. ఈ జాడ్యం ఎంత దాకా వెళ్ళింది అంటే ఒక పార్లమెంటు సభ్యుడు ఎమ్మెల్యేకు తెలియకుండా నియోజకవర్గంలో పర్యటించే పరిస్థితి లేదు. అధికార పార్టీ ఎంపీల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక ప్రతిపక్ష పార్టీల ఎంపీల దుస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ..
ఇలాంటి సుప్రీం ఎమ్మెల్యేల్లో అగ్రగణ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ఇతడి మీద ఎన్నో ఆరోపణలు, మరెన్నో వివాదాలు. సొంత కూతురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన ప్రభుత్వ భూమి రక్షణ కూడా కూలగొట్టినప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా సహించబోను అని చెప్పిన పెద్ద సారు.. ఇలా ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ఇలాంటి వాళ్లకు రేపటి ఎన్నికల్లో టికెట్లు ఇస్తే జనం ఎలా రిసీవ్ చేసుకోవాలి? అంటే ఓటుకు 2000 దాకా ఇస్తారు కాబట్టి చచ్చినట్టు కారు గుర్తుకు వేస్తారు అనే దీమానా? ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి ప్రజలకు గత్యంతరం లేదు అనే నమ్మకమా? తన తండ్రి తన పేరు మీద అక్రమంగా ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడని సాక్షాత్తు కూతురే చెబుతోంది. ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఈటెల రాజేందర్ విషయంలో రాత్రికి రాత్రి వేగంగా పనిచేసిన రాష్ట్ర దర్యాప్తు సంస్థలు.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విషయంలో ఎందుకు పనిచేయడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
సొంత బిడ్డ చెప్పింది
కబ్జాదారుడు అని సాక్షాత్తు సొంత బిడ్డ ఆరోపిస్తోంది. అవును మరి ప్రజాసేవ కోసం తప్పలేదని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గర్వంగా చెప్పుకుంటూ ఉండడం విశేషం. అంతేకాదు తన నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో సిసి రోడ్ల పనులు ప్రారంభించేందుకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వచ్చారు. పనుల ప్రారంభానికి ముందు ఎవరైనా కొబ్బరికాయ కొడతారు. ఆ కొబ్బరికాయ కొట్టాలి అంటే కచ్చితంగా వంగాలి. వంగాలి అంటే శరీరం సహకరించాలి. కార్యకర్తల ముందు వంగాలి అంటే నామర్ద అనుకున్నాడేమో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిలబడి ఉంటే.. కార్యకర్తలు ఒక రాయను లేపి ఆయన ఎదుట పట్టుకున్నారు. చాలా కష్టపడి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కొబ్బరికాయ కొట్టాడు. ఇలాంటి నేతలు ఉన్నారు కాబట్టే .. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మిగతా ప్రతిపక్ష పార్టీలకు ప్రజల్లో స్పేస్ దొరుకుతున్నది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే దీమా లభిస్తోంది. మరి ఇలాంటివి కేసీఆర్ దాకా పోవడం లేదా? పోయినా కెసిఆర్ లైట్ తీసుకుంటున్నారా? అన్నట్టు వచ్చే ఎన్నికల్లో ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వబోరని ప్రచారం జరుగుతోంది. అయితే మూడు నెలలు కదా అనుభవించని అని కేసీఆర్ అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరో మూడు నెలల్లో సమాధానం లభిస్తుందేమో.