Janasena: వైసీపీ పై జనసేన ‘అవినీతి’ పోరాటం.. ఫలితమిస్తుందా?

ఇటీవల పాల విలువ పథకంలో రూ. 2287 కోట్ల కుంభకోణం జరిగిందంటూ జనసేన ఆరోపణలు చేసింది. అయితే దీనిపై సంబంధిత మంత్రి డాక్టర్ అప్పలరాజు పది రోజులు తర్వాత స్పందించారు.

Written By: Dharma, Updated On : November 13, 2023 3:06 pm
Follow us on

Janasena: వైసిపి కలవరపాటు గురవుతోంది. తమపై ఎటువంటి అవినీతి ఆరోపణలు వస్తాయోనని నేతలు భయపడుతున్నారు. ఎన్నికల ముంగిట ప్రత్యర్ధులకు ఇవో రాజకీయ ఆస్త్రాలుగా మారుతాయి అని ఆందోళన చెందుతున్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో మీరు చేసిన పాపాల చిట్టా.. కుంభకోణాల గుట్టు ఆధారాలతో సహా బయటకు తీస్తామని జనసేన ప్రకటించడంతో.. అధికార వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నవంబర్ 14 నుంచి ఒక్కొక్కరి గుట్టు బయట పెడతామని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించడం విశేషం.

ఇటీవల పాల విలువ పథకంలో రూ. 2287 కోట్ల కుంభకోణం జరిగిందంటూ జనసేన ఆరోపణలు చేసింది. అయితే దీనిపై సంబంధిత మంత్రి డాక్టర్ అప్పలరాజు పది రోజులు తర్వాత స్పందించారు. జనసేన లేవనెత్తిన ఈ అంశాలపై సైతం ఆయన స్పందించలేదు. కేవలం వ్యక్తిగతంగానే విమర్శలకు దిగారు. అవినీతిపై మాట దాటేశారు. ముఖ్యంగా పశువుల కొనుగోలు విషయంలో ఇద్దరు మంత్రులు చేసిన ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయి. మరి మంత్రులే అలా ప్రకటిస్తుంటే.. అవినీతి నిజం కాదా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. వైసీపీ సర్కార్ 3.94 లక్షల వసూలు కొనుగోలు చేసినట్లు చెబుతోంది. కానీ పాల ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. అటు లబ్ధిదారుల వివరాలు సైతం వెల్లడించడం లేదు. ఇదే విషయాన్ని జనసేన ప్రస్తావించింది. కానీ పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ అప్పలరాజు మాత్రం ఏ విషయం పై సైతం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు.

జనసేన చేస్తున్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అవినీతి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో జనసేన నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 14 నుంచి వైసీపీ సర్కార్ లో సీఎం జగన్ నుంచి మంత్రుల వరకు.. ఆయా శాఖల్లో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. తొలుత పశుసంవర్ధక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అవినీతిని బయటపెట్టాలని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అంబులెన్స్ ల పేరుతో జరిగిన అవినీతిని వెల్లడించనున్నట్లు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇక్కడ నుంచి క్యాబినెట్ లో ఉన్న మంత్రుల అవినీతిని బయటకు తీస్తామని సైతం వెల్లడించారు. దీనికి సీఎం జగన్ సైతం అతీతం కాదని స్పష్టం చేశారు. దమ్ముంటే ఈ అవినీతి ఆరోపణలను ఎదుర్కోవాలని సవాల్ చేశారు.

అయితే మంత్రుల అవినీతిపై జనసేన లోతుగా అధ్యయనం చేస్తోంది. గణాంకాలతో సహా వివరాలు సేకరిస్తోంది. వాటినే ప్రజల ముందు బయట పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్నికల సమీపిస్తుండడంతో పవన్ రాజకీయ దూకుడు పెంచే అవకాశం ఉంది. వైసిపి మంత్రుల అవినీతిని ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎన్నికల్లో ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని మంత్రులు, కీలక నేతలు ఆందోళన చెందుతున్నారు. జనసేనపై ఎదురుదాడికి అన్ని విధాలా కసరత్తు చేస్తున్నారు.