Jana Sena- TDP: ఉత్తరాంధ్రపై జనసేన ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నగరంతో పాటు రూరల్ జిల్లాలో కూడా సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. వైసీపీ ఓటు బ్యాంకుపై గురిపెడుతూనే.. టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలపై దృష్టిపెట్టింది. అధికార, ప్రధాన విపక్షాలకు చెక్ చెబుతూ ప్రజాదరణ ఉన్న నాయకులను బరిలో దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం జనసేన బీజేపీతో మిత్రపక్షం కొనసాగుతోంది. బీజేపీకి విశాఖలో చెప్పుకునేటంత కేడర్ ఉంది. గతంలో ఎంపీ స్థానం గెలుచుకున్న చరిత్ర ఆ పార్టీది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పదవి నిర్వర్తిస్తున్న మాధవ్ కూడా విశాఖకు చెందిన వారే. నగర ఓటర్లలో విద్యాధికులు అధికం. పైగా ఉత్తరాధి రాష్ట్రాల ప్రజల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ బీజేపీ సాయం తోడైతే కీలక నియోజకవర్గాలను గెలుచుకోవవచ్చన్నది జనసేన భావన.

అధికార పార్టీకి గత ఎన్నికల్లో చాలావర్గాలు మద్దతు తెలిపాయి. వారందర్నీ జనసేన, బీజేపీ వైపు టర్న్ చేయాలన్న వ్యూహంతో ముందుకెళుతోంది. అటు నగరంలో నాలుగు నియోజకవర్గాలను టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా టీడీపీ విశాఖ ఉత్తరం, దక్షణం, పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో సత్తా చాటింది. ఇప్పటికీ ఆ పార్టీ హవా నగరంలో నడుస్తోంది. దానికి బ్రేక్ వేయాలని జనసేన భావిస్తోంది. మరీ ముఖ్యంగా 2009 నుంచి హ్యాట్రిక్ కొట్టిన వెలగపూడి రామక్రిష్ణ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ తూర్పు నియోజకవర్గంపై జనసేన టార్గెట్ పెట్టుకుంది. ఇక్కడ క్యాండిడేట్ ను సైతం సిద్ధం చేసింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదిరితే ఒకలా.. లేకుంటే మరోలా ఇక్కడ వ్యవహరించాలని డిసైడ్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని జనసేన ఖాతాలో పడాలని నాయకత్వం గట్టిగానే భావిస్తోంది.
ఇక్కడ జనసేన బలమైన అభ్యర్థిని రంగంలో దించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. వైసీపీ సర్కారుపై గట్టిగా పోరాడుతున్న కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను బరిలో దించాలని నిర్ణయించింది. తూర్పు నియోజకవర్గంలో యాదవులు అధికం. పైగా మూడుసార్లు కావడంతో వెలగపూడి రామక్రిష్ణబాబుపై ప్రజా వ్యతిరేకత ఉంది. దానిని క్యాష్ చేసుకోవాలని జనసేన భావిస్తోంది. గత ఎన్నికల్లోవెలగపూడి రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. 26 వేల మెజార్టీని సాధించారు. చంద్రబాబు తరువాత టీడీపీలో హయ్యాస్ట్ మెజార్టీ వెలగపూడిదే. అటువంటి నేతపై జనసేన గురిపెట్టడం సాహసమే అయినా.. మూర్తి యాదవ్ ను బరిలో దించితే మాత్రం విజయం తథ్యమని జనసేన నాయకత్వం భావిస్తోంది.

మరోవైపు పవన్ మరోసారి విశాఖ జిల్లా నుంచి బరిలో దిగుతారని అంతా భావిస్తున్నారు. గాజువాక నుంచి కానీ.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి కానీ పోటీచేస్తారని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే ఆ ప్రభావం విశాఖ జిల్లాపై తప్పకుండా పడుతుంది. మిగతా స్థానాలను సునాయాసంగా జనసేన దక్కించుకునే అవకాశముంది. ఇప్పటికే విశాఖ జిల్లాలో జనసేన బలంగా ఉంది. అటు సామాజికవర్గపరంగా కాపులు,తూర్పుకాపులతో పాటు మత్స్యకారులు ఆ పార్టీ గొడుగు కిందకు చేరారు. వివిధ పార్టీల్లో కీలక నాయకులు సైతం జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో దూకుడుగా ముందుకు సాగాలని జనసేన నాయకత్వం నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును టర్న్ చేసుకోవడంతో పాటు టీడీపీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్న అజెండాతో ప్రయత్నాలు చేస్తోంది.