Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి మరొకసారి బలమైన చర్చ జరుగుతోంది. అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కమిటీ.. ఈ పరిణామాలు మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణపై కర్ణాటక లో కాంగ్రెస్ సాధించిన గెలుపు ప్రభావం ఉంది. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్, చతిస్గడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు ఉన్నాయని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇండియా కూటమిలో ఐక్యత రోజురోజుకు పెరుగుతోంది. ఓట్ల చీలికపై ఇండియా కూటమి కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆప్_ కాంగ్రెస్ పార్టీ కలిస్తే పలు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ పరిణామాన్ని నరేంద్ర మోడీ ముందే ఊహించారా? అందుకే ఇటువంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారా? కేంద్రం జమిలీ లేదా మినీ జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉండొచ్చు? కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి ఇది లాభమా? నష్టమా?
ప్రస్తుత విధానం ప్రకారం
ప్రస్తుత విధానం ప్రకారం లోక్ సభకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే.. ఏటా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. జరిగే ఇలాంటి ఎన్నికలు పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావన. దీనిపై గతంలో పలు కమిటీలు అధ్యయనం చేశాయి. జస్టిస్ బీపీ జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణలపై ఇచ్చిన 170 నివేదికలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. 2015 డిసెంబర్ లో న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం 79 వ నివేదికలోనూ దీని గురించి ప్రస్తావించింది. 2017 నవంబర్లో అప్పటి నీతి అయోగ్ సభ్యుడు ఓఎస్డీ వివేక్ దెబరాయ్, కిషోర్ దేశాయ్.. జమిలీ ఎన్నికల మీద అధ్యయనం చేశారు.
ఒకేసారి సాధ్యమేనా?
జమిలీ ఎన్నికలంటే పార్లమెంట్ తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహించాలి. స్తుత పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల అసెంబ్లీల అధికారిక గడువులు భిన్నంగా ఉన్నాయి. వీటన్నింటినీ రాబోయే సార్వత్రిక ఎన్నికలతో కలపాలి అంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును పెంచడం.. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును తగ్గించడం చేయాలి. లోక్ సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. కానీ అది అనుకున్నంత సులభం కాదు. ఇందుకు రాజ్యాంగపరంగా అవరోధాలు ఉన్నాయి. దీన్ని అధిగమించాలంటే దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు తెన్నులు, మార్గదర్శకాలకు ఉద్దేశించిన 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. పలు కీలకమైన రాజ్యాంగ సవరణలకు పార్లమెంట్ ఆమోదముద్ర వేయాలి. మనది కేవలం పార్లమెంటరీ ప్రజాస్వామ్య కాకుండా, సమాఖ్య వ్యవస్థ కూడా. రాష్ట్ర ప్రభుత్వాల మాటకు కూడా విలువ ఉంటుంది. అంటే వాటినీ ఒప్పించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రాలలో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వాల కాలపరిమితి కూడా ప్రధానమైనదే. జమిలి ఎన్నికల కోసం వాటి అసెంబ్లీ కాలాన్ని కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటాయో వేచి చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు 2/3 మెజారిటీతో ఆమోదించాలి. దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీ లు కూడా ఆమోదిస్తూ తీర్మానించాలి.
ఓటర్ కోణంలో చూస్తే..
లోక్ సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఒకే రోజు అన్ని ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కలుగుతుంది. ఎన్నికల సమయంలో ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుంది కాబట్టి సాధారణ పరిపాలన, ఇతర కార్యకలాపాలు సజావుగా సాగినప్పటికీ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయి.
రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి
ఒక్కో రాష్ట్ర అసెంబ్లీకి సగటున రెండు నెలలపాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని నీతి ఆయోగ్ చెబుతోంది. ఇంద్ర ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల భారాన్ని 100%, అసెంబ్లీల ఎన్నికల భారాన్ని 50 శాతం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికల భారాన్ని 50%, స్థానిక సంస్థల ఎన్నికల భారాన్ని 100% భరించాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికలకు దాదాపు 4వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. పెద్ద రాష్ట్రాల ఎన్నికలకు ఒక్కొక్క దానికి 300 కోట్లు భరించాల్సి వస్తుంది. అదే ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఎన్నికల నిర్వహణ అన్నది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం.. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ బలగాలు, పోలీసులు, హోం గార్డుల సహాయం తీసుకోవాలి. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ 10 లక్షల పోలింగ్ బూత్ ల్లో 75 రోజులకు పైగా సాగింది. ఒక్కో పోలింగ్ బూత్ కు సగటున 10.75 మంది ప్రభుత్వ ఉద్యోగులు కావాలి అనేది ఒక అంచనా. అంటే 2019 ఎన్నికల్లో కోటి మందికి పైగానే సిబ్బంది 75 రోజుల సుదీర్ఘ ఎన్నికల నిర్వహణకు పరిమితమయ్యారు.. ఇప్పుడున్న విధానం ప్రకారం ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడం వల్ల రాజకీయ పార్టీలు నిరంతరం ప్రచార కార్యక్రమాల్లో మునిగి ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హ్రస్వదృష్టితో కూడిన ప్రజాకర్షక విధానాలకే మొగ్గు చూపుతాయి. ప్రజలకు దీర్ఘకాలంలో మేలు చేసే సంక్లిష్టమైన సంస్కరణల జోలికి పోవు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jamili elections who benefits whose loss
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com