Jagan: ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచనున్నారు. ఎన్నికల ప్రచారంతో హోరెత్తించనున్నారు. పార్టీ శ్రేణులను అలెర్ట్ చేయనున్నారు. క్యాడర్ తో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న జిల్లాలను ఐదు రీజియన్లుగా తీసుకొని పార్టీ క్యాడర్ తో ప్రత్యేకంగా సమావేశం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఏపీలో ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నాయి. వీటిని ఐదు రీజియన్లుగా విభజించి.. పార్టీ కార్యకర్తలతో భారీ సమావేశాలు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఈ సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు జగన్. తొలి సమావేశాన్ని ఈనెల 25న విశాఖ జిల్లా భీమిలిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్ర నుంచి వైసీపీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుందన్న మాట . భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జగన్ సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కాలంలో జనంతో ఏ విధంగా మమేకం కావాలో కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
మిగతా నాలుగు రీజియన్లలో సైతం ఈ సమావేశాలు జరగనున్నాయి. మంత్రులతో పాటు కీలక నేతలు హాజరై క్యాడర్లో ఉత్తేజం తేనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి తాము ఎన్నికలకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన జగన్.. ఇప్పుడు జనాల్లోకి బలంగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మరోవైపు చంద్రబాబు రా కదలిరా పేరుతో వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకుపార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. ఆ సభలకు భారీగా జనాలు రావడంతో వైసీపీలో కలవరపాటు కలుగుతోంది. అందుకు విరుగుడుగా వైసిపి రీజియన్ స్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో పార్టీ శ్రేణులు సైతం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.