CM Jagan: ఏపీ సీఎం జగన్ కు కుటుంబాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రాజకీయాల కోసం కుటుంబాలను చీల్చుతారని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ముందు తాను చేసిన విన్యాసాలను మర్చిపోయారు. అధికారం కోసం ఏ స్థాయిలో వక్ర భాష్యాలు చెప్పారు ఆయనకు తెలియనిది కాదు. కానీ ఇప్పుడు తన వరకు వచ్చేసరికి ఉలిక్కిపడుతున్నారు. తన కుటుంబాన్ని చీల్చుతారని సంకేతాలు పంపుతున్నారు. అయితే కుటుంబం ఏనాడో చీలిపోయింది. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కుటుంబం అడ్డగోలుగా చీలిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సోదరి షర్మిలను పట్టించుకోకపోవడంతో ఆమె వెంట తల్లి విజయమ్మ కూడా అనుసరించింది. అంతకుమించి ఆ కుటుంబంలో ఎవరు ఏమీ చేయలేదు. కానీ చీలికకు కారణమైన తనపై కుటుంబం ఎదురుదాడి చేసేసరికి.. ఇతరులపై నెపం పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత ఎన్నికల ముందు రామోజీరావు ఇంట్లో జరిగిన కథ జగన్ కు గుర్తుంటుంది. ఆయన కుమారుడు సుమన్ విషయంలో తాను ఎలా దిగజారింది కూడా ఏపీ ప్రజలకు తెలుసు. రామోజీరావు నీకు రాజకీయ ప్రత్యర్థే కావచ్చు. ఒక మీడియా అధిపతిగా మీపై తప్పుడు రాతలే రాయవచ్చు. కానీ నాడు ఆయన కుమారుడు సుమన్ క్యాన్సర్ తో బాధపడితే.. రాజకీయాల కోసం మద్య పెట్టి సాక్షిలో తప్పుడు రాతలు రాయించిన విషయం గుర్తులేదా? అంతెందుకు చంద్రబాబు సమీప బంధువు, జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నియా శ్రీనివాసరావు విషయంలో మీరు చేసింది రాజకీయం కాదా? అయ్యన్నపాత్రుడు సోదరుడి విషయంలో మీరు చేసింది రాజకీయం కాదా?మీరు అధికారంలోకి వచ్చేందుకు ప్రజల మధ్య కుల, మత, వర్గ విభేదాలను రెచ్చగొట్టింది వాస్తవం కాదా? బాధితుడి ప్లేసులో తాము వచ్చేసరికి ఇప్పుడా అర్థమైంది? కుటుంబ చీలికల విషయంలో జగన్ ఒక వేని చూపిస్తే.. అటు నుంచి పది వేళ్లు చూపెడతాయన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కుటుంబాల్లో చీలిక తెస్తారు అన్న జగన్ ప్రకటన చూసి వైసీపీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తల్లి చెల్లిని అడ్డగోలుగా గెంటేసి.. వారు ఇబ్బందుల్లో ఉంటే సాయం చేసేందుకు వెళ్లిన వారిని సైతం భయపెట్టిన వైనాన్ని వైసీపీ శ్రేణులు మరిచిపోలేదు. కాకినాడలో పెన్షన్ పెంపు వేడుకల్లో పాల్గొన్న జగన్ మాటలను చూసి వైసిపి నేతలే బిత్తర పోయారు. తన విజయానికి కృషి చేసిన షర్మిల సేవలు గుర్తుండవేమో కానీ.. ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల తో పాటు తల్లి ఎదుర్కొన్న పరిణామాలు కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు షర్మిల ఏపీలో రాజకీయాలు చేసేందుకు.. కాంగ్రెస్ లో చేరబోతున్నందుకు.. తనకు నష్టం వస్తుందని క్లారిటీ వచ్చినందుకు.. జగన్ కొత్త తరహా ప్రయోగాలను ప్రారంభించారు. కుటుంబాలను చీల్చుతారని హెచ్చరించే దాకా వచ్చారు.
తెలంగాణ రాజకీయాలు చేసే వారితో తమకు ఏం పని అని తమ సకల శాఖ మంత్రితో చెప్పించడం గుర్తు లేదా? అప్పుడు ఆమె మీ కుటుంబ సభ్యురాలు కాదా? తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఇబ్బంది పడినప్పుడు మీ కుటుంబ సభ్యురాలు కదా? తెలంగాణ రాజకీయాల్లో ఫెయిల్ అయినప్పుడు కూడా మీకు గుర్తుకు రాలేదా? షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఖాయం. ఏపీ పగ్గాలు తీసుకోవడం అంతకంటే ఖాయం. వాటికి మించి కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయం. ఆమె ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించడం ఖాయం. ఇవన్నీ తెలిసేసరికి జగన్ లో ఒక రకమైన భయం ప్రారంభమైంది. ఆ భయం నుంచి వచ్చిన మాటే కుటుంబాల్లో చీలిక ప్రకటన. దీనికి ముమ్మాటికీ జగన్ బాధితులు కాదు. ఆయన చేతుల్లో ఎంతోమంది ఇంతకుముందే బాధితులుగా మిగిలారు. సొంత కుటుంబం సైతం ఆయన చేతిలో బాధితురాలిగా మారింది. ఇప్పుడు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్.. కొత్తగా కుటుంబ చీలిక విషయాన్ని ప్రస్తావించారు. భయపడుతున్నట్లు నటిస్తున్నారు. అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు.