
Jagan London Tour: ఏపీ సీఎం జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తనపై సీబీఐ కేసులు నమోదైనప్పుడు, జైలు జీవితం అనుభవించినప్పుడు కూడా ఇంతలా హైరానా పడలేదు. ఆ కేసులు, జైలు జీవితం పవర్ ఫుల్ లీడర్ గా తీర్చిదిద్దగా.. ఇప్పుడు ఎదురవుతున్న కేసుల పరిణామాలు రాజకీయ జీవితానికి దెబ్బకొట్టేలా ఉన్నాయి. దీంతో జగన్ అలెర్టయ్యారు. తాజా పరిణామాలను ఎలా ఎదుర్కొవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఎన్నికల ఏడాదిలోనే కోడి కత్తి కేసు ఒక వైపు, బాబాయ్ వివేకా హత్య కేసు తెరపైకి రావడంతో జగన్ కు నిద్రపట్టడం లేదు. గతఎన్నికల ముందు ఈ రెండు కేసులూ రాజకీయ లబ్ధికి జగన్ వినియోగించుకున్నారు. ఇప్పడు కేసుల్లో వాస్తవాలు బయటకు వస్తుండడంతో కలవరపాటుకు గురవుతున్నారు.
ఎన్నికల్లో రాజకీయ లబ్ధి..
గత ఎన్నికల ముందు పీకే వ్యూహాల్లో భాగంగా చాలా చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఘటనలను అప్పటి విపక్షమే సృష్టించి రాజకీయ లబ్ధి పొందిందని ఇప్పటికీ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈ క్రమంలో జరిగిందే కోడికత్తి దాడి. నాడు పాదయాత్ర ముగించుకొని సీబీఐ వారంతపు విచారణకు వెళుతున్నజగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగింది. రాజకీయ ప్రేరేపిత దాడి అని అప్పట్లో జగన్ ఆరోపించారు. ఏపీ పోలీసులకు కాదని ఎన్ఐఏ తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్పటి సర్కారు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. దర్యాప్తు పూర్తిచేసిన ఎన్ఐఏ ఎటువంటి కుట్ర లేదని తేల్చేసింది. అసలు దాడిచేసిన శ్రీనివాసరావుకు టీడీపీతో ఎటువంటి సంబంధాలు లేవని కూడా తేల్చి చెప్పింది. జగన్ కు ప్రజల్లో సానుభూతి కోసమే తాను ఈ ఘటనకు పాల్పడినట్టు నిందితుడు శ్రీనివాసరావు చెప్పడంతో అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి.
కేవలం ఆ ముగ్గురితోనే…
బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో సమీప బంధువు, కడప ఎంపీ భాస్కరరెడ్డి అరెస్టయ్యారు. ఎంపీని సైతం అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనకు విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వడంతో అరెస్ట్ తప్పకుండా జరుగుతుందని టాక్ నడుస్తోంది. దీంతో ఈ అంశం జగన్ కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే లండన్ పర్యటన రద్దుచేసుకున్నట్టు తెలుస్తోంది. హుటాహుటిన సజ్జల రామక్రిష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డితో సీఎం తాడేపల్లి ప్యాలెస్ లో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా చర్చించారు. తన ప్రతిష్ఠకు, రాజకీయంగా వైసీపీకి కలిగించిన నష్టంపై అంతర్మథనం చెందుతున్నట్టు తెలిసింది. తొలుత పార్టీ నేతలతో సమావేశమని చెప్పినా.. ముఖ్య నేతలుగా ఉన్నర ఆ ముగ్గురితో చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రివర్స్ అటాక్…
గత ఎన్నికల ముందు ఈ రెండు ఘటనలు జగన్ కు ప్రజల్లో అపారమైన సానుభూతి కల్పించాయి. ఓట్లు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఈ ఎన్నికల్లో విపక్షాలకు అవే ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. దీంతో వైసీపీ వర్గాలు కూడా ఆందోళనతో ఉన్నాయి. నష్టం తప్పదన్న అంచనాకు వస్తున్నాయి. ప్రజల ముందు విలన్ గా చూపడం ఖాయమని చెబుతున్నాయి. కోడికత్తి కేసును రాజకీయం చేసి.. హత్యాయత్నం అంటూ నెపం చంద్రబాబుపై నెట్టేసే ప్రయత్నం చేసిన జగన్‌ను.. జనం ఇప్పుడు అపరాధిలా చూస్తున్నారు. నాడు చెప్పినవన్నీ కట్టుకథలని తేలిపోయింది. ఎన్‌ఐఏ వెల్లడించిన వాస్తవాలు టీడీపీకి ఆయుధంగా మారాయని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇదే సమయంలో చిన్నాన్నను చంద్రబాబే హత్య చేయించారంటూ ‘నారాసుర రక్తచరిత్ర’ పేరిట జగన్ సొంత మీడియాలో కథనాలు వండివార్చారు. ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తుండడంతో మైనస్ గా మారుతోంది.

వైసీపీ శ్రేణులు సైలెంట్
పార్టీపైనా.. అధినేత జగన్ పైనా ఎవరైనా మాట్లాడితే వైసీపీ శ్రేణులు పోటీపడి మరీ ఎదుర్కొనేవారు. కానీ ఇప్పడా పరిస్థితి లేదు. తాజా పరిణామాలపై వైసీపీ నేతలెవరూ పెదవి విప్పడం లేదు. వ్యూహాత్మక మౌనాన్నే పాటిస్తున్నారు. జగన్‌కు వరుస ప్రతికూలతలు ఎదురవుతుండడం వారిని విస్మయానికి లోనవుతున్నారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలో తెలియక మంత్రులు కూడా గందరగోళంలో పడిపోతున్నారు. చాలా మంది మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. సీఎం జగన్ ముందస్తుగా పెట్టుకున్న లండన్ పర్యటనను రద్దుచేసుకునేదాక పరిస్తితి వచ్చిందంటే మ్యాటర్ చాలా సీరియస్ గా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.