Jagan Made A Key Statement: ప్రజల్లో మైలేజ్ పెంచుకున్న వారికే టిక్కెట్లు కేటాయిస్తాం. నా గ్రాఫ్ బాగుంది. మీ గ్రాఫ్ పెంచుకోండి. అంటూ ఎమ్మెల్యేలను హెచ్చరించిన ఏపీ సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి సంచలన ప్రకటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఇప్పటికే ఆయన సన్నద్ధంగా ఉన్నారు. కొత్త జిల్లాలను ప్రకటించారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏకంగా తన కేబినెట్ లో పదుల సంఖ్యలో మంత్రులను మార్చి కొత్తవారికి అవకాశమిచ్చారు. పదవులు పోయిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అన్నివర్గాలను పెద్దపీట వేస్తూ చేపడుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, గత మూడేళ్లలో చేసిన పనులు చెప్పుకునేందుకు గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని సైతం శ్రీకారం చుట్టారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో బస్సు యాత్రను సైతం చేయించారు. ఇవంతా ముందస్తు ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న టాక్ నడుస్తోంది. రెండో సారి అధికారమే లక్ష్యంగా ఆయన ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు జగన్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పొత్తుల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ వ్యూహాలకు అందకుండా.. జెట్ స్పీడ్ వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ముందుగానే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఎవరెవరికి టికెట్లు ఇవ్వడం లేదన్న విషయంలోనూ త్వరలో క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఈ రెండు నిర్ణయాలతో ప్రతిపక్షాల పైన ఒత్తిడి పెంచే వ్యూహం ఆయన అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

సంచలన ప్రకటన..
మహానాడు సక్సెస్ తరువాత టీడీపీలో జోష్ నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా కీలక ప్రకటనలు చేశారు. 40 శాతం యువతకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కొన్ని కీలకమైన తీర్మానాలు చేశార. దీంతో ఆ పార్టీలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. వచ్చే ఎన్నికలకు టానిక్ లా పనిచేసింది. మహానాడు మాదిరిగా వైసీపీ ప్లీనరీ సక్సెస్ కావాలని జగన్ భావిస్తున్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అదే మాదిరిగా సంచలనాలు నమోదు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల తాను తెప్పించుకున్న నివేదికలు.. గడప గడపకు ప్రభుత్వం తరువాత ఎమ్మెల్యే పనితీరును పరిగణలోకి తీసుకొని టిక్కెట్ల ఖరారుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. నియోజకవర్గాల కేడర్ నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను తెలుసుకున్నారు. 2023లో ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరు నుంచి 10 నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించే అంశం పైన ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రకటనతో అభ్యర్ధులను ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గర చేసి..వారితో ఎన్నికల సమయానికి పూర్తిగా మమేకం అయ్యేలా చూడాలని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా పొత్తుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్న ప్రతిపక్ష పార్టీల పైన టిక్కెట్ల ఒత్తిడి పెరగటం తో పాటుగా టిక్కెట్లు ఎవరికి ఇచ్చేది తేల్చేయటం ద్వారా పోటీలో ఉండే అభ్యర్ధులకు ప్రచారానికి.. ప్రజలతో దగ్గరవ్వటానికి సమయం దొరుకుతుందని విశ్లేషిస్తున్నారు.

వారిని మార్చేస్తారు..
ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామందిపై వ్యతిరేకత ఉంది. వారిని మార్చాలన్న డిమాండ్ ఉంది. అటువంటి వారి సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు. వారందరికీ టిక్కెట్లు ఈ సారి ఇవ్వమని తేల్చనున్నారు. ఎన్నికలకు ముందుగానే క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. అలాగే తాను ప్రకటించే అభ్యర్థిని గెలిపిస్తే.. భవిష్యత్తులో వారికి ఏమీ చేస్తారు అన్నదానిపై స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇక,ప్లీనరీ వేదికగా వచ్చే ఎన్నికల పైన కీలక ప్రకటనతో పాటుగా.. 2019 ఎన్నికల హామీలు…2024 లో చేయబోయే కార్యక్రమాల పైన ముందుగానే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలిసి చాలామంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. టిక్కెట్ కేటాయింపులు లేని జాబితాలో తమ పేరు ఎక్కడుంటుందోనని మదనపడుతున్నారు. ప్రభుత్వం, పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాలకు తాము బలవుతున్నామని.. ప్రభుత్వ వ్యతిరేకతను తమను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తామన్నా, పేరు ప్రకటించినా అందుకు అధిష్టానం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అనుచరుల వద్ద స్పష్టం చేస్తున్నారు.