Balineni Srinivasa Reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డిని సాగనంపడానికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వానికి, పార్టీకి ఇరుకున పెట్టే విధంగా బాలినేని వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో సీఎం జగన్ తో పాటు పార్టీ పెద్దలు బాలినేని తీరుపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. బుజ్జగించడం కంటే పార్టీ నుంచి బయటకు పంపించడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో వైసీపీ నుంచి మరో సీనియర్ నేత నిష్క్రమణ ఖాయమన్నట్లు తేలుతోంది. అదే జరిగితే బాలినేని అడుగులు ఎటువైపు పడతాయి అన్న టాక్ ప్రారంభమైంది.
సీఎం జగన్ కు బాలినేని సమీప బంధువు. అందుకే జగన్ తన తొలి క్యాబినెట్ లోనే బాలినేనికి చోటు ఇచ్చారు. సీనియర్ మంత్రులతో పాటు తనకు కొనసాగింపు దక్కుతుందని బాలినేని భావించారు. కానీ మంత్రివర్గ విస్తరణలో జగన్ కోత పెట్టారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ ని మాత్రం కొనసాగించారు. అయితే తనను తొలగించిన దానికంటే ఆదిమూలపు సురేష్ కొనసాగింపే బాలినేనికి బాధ కలిగించింది. అప్పటినుంచి ఆయన లో లోపల రగిలిపోతున్నారు. దీనంతటికీ కారణం వై వి సుబ్బారెడ్డి అని బలంగా నమ్ముతున్నారు. తనకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గిపోగా.. వై వి సుబ్బారెడ్డికి అత్యంత ప్రాధాన్యం దక్కుతుండడంపై మనస్థాపంతో ఉన్నారు.
ముఖ్యమంత్రి జగన్తో బాలినేని చాలా గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు పవన్ కళ్యాణ్ కారణమన్న విశ్లేషణ ఉంది. గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రశంసలను బాలినేని అందుకున్నారు. చేనేత వస్త్రాలను ధరించాలని పవన్ సవాల్ విసిరితే.. దానిని బాలినేని స్వీకరించి ఆచరించారు. ఆ తరుణంలోనే ఆయన జనసేనలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని బాలినేని ఖండించారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదిరిన తర్వాత.. ప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలపై బాలినేని విమర్శల జోరు పెంచడం విశేషం.
ప్రస్తుతం తనకున్న సెక్యూరిటీని బాలినేని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ వ్యవహారంలో తాను చెప్పినట్లు పోలీసులు నడుచుకోలేదని ఏకంగా తన గన్ మెన్లను ఉపసంహరించుకున్నారు. కొద్ది నెలల కిందట వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇదే మాదిరిగా తన గన్మెన్లను ఉపసంహరించుకున్నారు. సరిగ్గా అదే మాదిరిగా బాలినేని సైతం వ్యవహరించడం విశేషం. దీన్ని బట్టి చూస్తుంటే వైసీపీలో బాలినేని అయిష్టంగానే కొనసాగుతున్నారనేది బహిరంగ రహస్యంగా తెలుస్తోంది. జగన్ కోసం మంత్రి పదవిని వదులుకొని వస్తే.. తనకు ఇచ్చిన ప్రాధాన్యం ఇదా? అంటూ బాలినేని రుసరుసలాడుతున్నారు. జగన్తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే తనను విభేదించే వారి విషయంలో జగన్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో బాలినేనికి తెలుసు. అదే సమయంలో జగన్ సైతం బాలినేని వదులుకునేందుకుదాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.