AP Salaries: ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒకటో తేదీన ఠంచనుగా జీతం. అవసరానికి రుణం. పీఎఫ్, జీపీఎఫ్ నుంచి అడ్వాన్సులు, ఎర్న్ లీవ్స్, ఎప్పటికప్పుడు డీఏలు, పీఆర్సీతో పెరిగిన వేతనాలు ఇలా అన్ని రకాల బెనిఫిట్ లు ఉండేవి. కానీ జగన్ గద్దెనెక్కాక ఒక్కొక్కటీ దూరమవుతూ వస్తోంది. ఇప్పుడు మూడో వారం సమీపిస్తున్నా అకౌంట్స్ లో జీతాలు పడని పరిస్థితి. జీతాల మెసేజ్ ఎప్పుడు వస్తుందా? అని ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా సెల్ ఫోన్ల వైపు చూడాల్సిన పరిస్థితి దాపురించింది. 13 తేదీ వచ్చినా కేవలం 60 శాతం మంది ఉద్యోగులు, సిబ్బందికే వేతనాలు అందాయి. మిగతా 40 శాతం మందికి అందించలేదు. ఎప్పుడు అందిస్తారో కూడా తెలియని దుస్థితి. ఎందుకంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ముందు తెచ్చిన రుణాలకే వడ్డీ కడుతోంది. ఇప్పుడు జీతాలు ఇచ్చుకోలేక చేతులెత్తేసింది. అదనపు బెనిఫిట్స్ కోసం ఉద్యోగులు ధర్నాలు, ఆందోళనలు చేయడం సహజం. కానీ జీతాలు కోసం రోడ్డెక్కాల్సిన దౌర్భగ్య పరిస్థితి ఏపీలో ఉంది. జీతాలు ఇవ్వండి మహా ప్రభో అంటూ వారు కాళ్లవేల్లా పడుతున్నారు.

విపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రకటనలను ఇప్పుడు ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ‘ ప్రభుత్వ ఉద్యోగి ముఖంలో ఎప్పుడైతే చిరునవ్వు కనిపిస్తుందో..అప్పుడే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. పేదవాడికి మంచి చేయడానికి ఆరాట పడే పరిస్థితి వస్తుంది. మేం అధికారంలోకి వస్తే రావాల్సినవన్నీ సరిగ్గా సమయానికి వచ్చేటట్టు చూస్తాం. ప్రతీ డీఏ సమయానికి ప్రకటించి అందిస్తాం’.. అంటూ విపక్ష నేతగా ఎన్నో సందర్భాల్లో జగన్ ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. పోనీ గతంలో మాదిరిగా ఫస్ట్ తారీఖున వేతనాలు చెల్లించినా సర్దుకుపోయే వారు. కానీ మూడో వారం సమీపిస్తుండడంతో అసలు తాము ఉద్యోగులమేనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. కుటుంబ అవసరాల కోసం చాలామంది బయట అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.,
ప్రభుత్వ ఉద్యోగికి జీతం సమస్య వస్తుందని ఎవరూ అనుకోరు. ప్రభుత్వమంటే వ్యాపార సంస్థో, ప్రైవేటు ఆర్గనైజేషనో కాదు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ప్రజా సంక్షేమం కోసం ఆ డబ్బును ఖర్చేచేసే ఒక వ్యవస్థే ప్రభుత్వం. పాలనలో ఉద్యోగులూ ఒక భాగం. వారికి జీతాలు చెల్లించడం ప్రభుత్వ ప్రధాన విధి. దానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు. ప్రభుత్వం ఇవ్వకుంటే డిమాండ్ చేసే అధికారం ఉద్యోగులకు ఉంటుంది. దానిని ఎవరూ కాదనలేని పరిస్థితి. కానీ మన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగులకు సహనం ఉండాలట. ఎంతలా అంటే అవసరాలకు ప్రభుత్వం కాళ్లు పట్టుకునేటంతగా సహనం, ఓర్పు ఉండాలని సెలవిచ్చారు. మరో సలహాదారు, జగన్ కు సామంత రాజుగా ఉన్న సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే ప్రజల కోసం జగన్ బటన్ నొక్కుతున్నారని.. మీకు అలాగే నొక్కాలంటే కుదరదని ఉద్యోగులకు తేల్చిచెప్పారు. అంటే మా అవసరం మీతో కాదు.. ప్రజలతోనేని సజ్జల వారు సెలవిచ్చారు. ఇక ముందు కూడా ఇలానే పరిస్థితి ఉంటుందని చెప్పకనే చెప్పారు.

ప్రతినెల జీతాలకు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లకు దాదాపు రూ.5,500 కోట్లు అవసరం. ఫస్ట్ తారీఖున అందించే సామాజిక పింఛన్లకు రూ.1,500 కోట్లు అవసరం. అంటే నెలాఖరుకు ప్రభుత్వం రూ,7,000 కోట్లు పెట్టుకుంటే కానీ జీతాల సమస్య కొలిక్కి రాదన్న మాట. కానీ నవంబరు నెల జీతాలకు సంబంధించి నెలాఖరుకు ప్రభుత్వం వద్ద చిల్లిగవ్వలేదు. ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని సామాజిక పింఛన్లు, 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు జీతాలు సర్దుబాటు చేశారు. అటు తరువాత ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయంతో జీతాలు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. అయితే ఓడీ పరిమితి దాటిపోవడంతో ఆర్బీఐ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా జమ చేసుకోవడం ప్రారంభించింది. దాని ప్రభావమే మూడో వారం సమీపిస్తున్నా ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి.. ప్రభుత్వం ఓడీలు దాటుకొని.. అప్పులకు వడ్డీ చెల్లించి బయటపడేసరికి నెలాఖరు పడుతోంది. ఈలోగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అవసరమవుతోంది. వాటిని ఎలా సర్దుబాటు చేయాలో తలపట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఎలాగోలా నెట్టుకొచ్చినా.. ఇక .నుంచి మాత్రం కష్టమేనన్న సంకేతాలు కేంద్రం నుంచి వస్తున్నాయి. కేంద్రం కానీ రుణాలకు అనుమతివ్వకపోతే ఏపీ ప్రభుత్వం దివాలా తీసినట్టే. కానీ ఏమీ జరగనట్టు జగన్ సర్కారు నటిస్తోంది. ఏపీ సమాజాన్ని జాతీయ స్థాయిలో నవ్వులపాలు చేస్తోంది, సంక్షేమం మాటున ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది.