Jagan: రాష్ట్రవ్యాప్తంగా ఒక ఎత్తు.. గోదావరి జిల్లాల్లో మరో ఎత్తు. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాలే కీలకం. అక్కడ మెజారిటీ స్థానాలను దక్కించుకుంటేనే ఆ పార్టీ అధికారంలోకి రాగలదు. అందుకే అక్కడ పట్టు కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. సరిగ్గా అటువంటి జిల్లాల్లో జగన్ చేస్తున్న ప్రయోగాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అన్నది మాత్రం ఎవరు అంచనా వేయలేకపోతున్నారు.
గోదావరి జిల్లాల్లో టిడిపి, జనసేన స్వీప్ చేయాలని పవన్ బలంగా ఆకాంక్షిస్తున్నారు.అదే ప్రయత్నాల్లో ఉంటున్నారు. పార్టీ శ్రేణులకు అదే పిలుపునిస్తున్నారు. అయితే అక్కడే జగన్ తన వ్యూహ చతురతను ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 మంది అభ్యర్థులను మార్చారు. మరో 20 మందికి మార్పు తప్పదని సంకేతాలు ఇస్తున్నారు. అయితే గోదావరి జిల్లాల్లో అభ్యర్థులను మార్చుతుండడం మాత్రం సాహసం అనే చెప్పాలి. ఇక్కడ టిడిపి, జనసేన కూటమి బలంగా ఉంది. కానీ అభ్యర్థులను మార్చి జగన్ ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు. కొందరిని ఏకంగా పక్కన పెడుతున్నారు. మరికొందరికి స్థానచలనం కల్పిస్తున్నారు.
అయితే జగన్ చేస్తున్నది సాహసమా? లేకుంటే తెగింపా అన్నది తెలియాల్సి ఉంది. జగన్ అంతరంగం సొంత పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. కానీ జగన్ వ్యూహం వెనుక ఏదో ఒకటి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు తప్పుపడుతున్నారు. వ్యతిరేక మీడియా నమ్ముకున్న వారిని నట్టేట ముంచే యత్నమని రాసుకొస్తుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల మార్పు ఎటువంటి ఆశ్చర్యం లేకపోయినా.. గోదావరి జిల్లాల విషయంలో మాత్రం జగన్ ది సాహసం గానే ఎక్కువ మంది చెప్పుకొస్తున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.. ఫలితాలు వచ్చాక గానీ తేలదు.