CM Jagan: జాతీయస్థాయిలో వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. అటు కాంగ్రెస్ తో పాటు బిజెపితో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఏకకాలంలో రెండు పార్టీలకు టచ్ లోకి వెళ్తోంది. కాంగ్రెసులో వైయస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులతో రాజకీయం చేస్తుండగా.. అటు బిజెపికి కోపం రాకుండా రకరకాల వింత చర్యలతో విజయసాయి రెడ్డి ముందుకెళుతున్నారు. అయితే కాంగ్రెస్, బిజెపి లను సమానంగా వాడుకోవాలని చూస్తున్న జగన్ కు.. ఆ రెండు పార్టీలు ఏదో ఒక దాని నుంచి ఝలక్ తప్పదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏపీలో కాంగ్రెస్, బిజెపి యాక్టివ్ రాజకీయాలు చేస్తే.. ముందుగా మూల్యం చెల్లించుకునేది వైసీపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కన్నెర్ర చేస్తే జగన్ పై ఉన్న పాత కేసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందుకే గత ఐదు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో జగన్ రాజీ పడుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే.. తన పార్టీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పరితపిస్తున్నారు. వివిధ అవసరాల దృష్ట్యా కేంద్రం సైతం జగన్తో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడు గానీ బిజెపి… టిడిపి, జనసేన కూటమిలో చేరితే వైసీపీకి చేటు తెస్తుంది. అందుకే ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను ఏపీలో యాక్టివ్ చేస్తే వైసీపీకి తప్పకుండా నష్టం జరుగుతుంది. వైయస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే వైసిపి నాయకత్వం నుంచి కింది స్థాయి కేడర్ వరకు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఒకవేళ2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే… కాంగ్రెస్ బలమైన శక్తిగా మారడం ఖాయం. ప్రత్యామ్నాయం లేక చాలామంది వైసిపి నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లభిస్తే మాత్రం అటువంటివారు వైసీపీలో కొనసాగరు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న 80% శ్రేణులు కాంగ్రెస్ వారే. అందుకే షర్మిల కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అవసరమైతే ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది.
అయితే జగన్ ఏకకాలంలో ఆడుతున్న నాటకం బిజెపి నేతలు గ్రహించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జగన్ తమకు హ్యాండిస్తారని కూడా బిజెపి భావిస్తోంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ లాంటి నేతలతో జగన్ టచ్లోకి వెళ్లారని.. అది ఒక కుటుంబం కోసమే కాదని.. భావి రాజకీయాల కోసమేనని బిజెపి అనుమానిస్తోంది. దీంతో జగన్ విజయసాయిరెడ్డిని ప్రయోగించారు. పార్లమెంటులో కాశ్మీర్ పై జరిగిన చర్చలు బిజెపిని చల్లబరిచేందుకు ఏకంగా నెహ్రూను విజయసాయిరెడ్డి నిందించారు. తరువాత ప్రధాని మోదీని కలిసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ ఫోటోలు బయట పెట్టలేదు. అయితే జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ ను బిజెపి, కాంగ్రెస్ నాయకత్వాలు గమనిస్తున్నాయి. ఏదో ఒక పార్టీకి జగన్ శత్రువు కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.