CM Jagan On Visakha
CM Jagan On Visakha: విశాఖ నుంచి పాలన నిర్ణయం వెనుక సీఎం జగన్ ప్రత్యేక వ్యూహంతో అడుగులేస్తున్నారా? సరిగ్గా విజయదశమి నుంచి పాలన సాగిస్తామన్న ప్రకటన వెనుక ఎన్నో రకాల వ్యూహాలు ఉన్నాయా? ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయమా? చంద్రబాబు అరెస్టుతో టిడిపికి దక్కుతున్న సానుభూతిని తగ్గించడానికే విశాఖ పాలనకు తెర తీశారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో విశాఖ నుంచి పాలనపై జగన్ స్పష్టతనిచ్చారు. కానీ శాసనసభ సమావేశాల్లో చివరి రోజున ముందస్తుకు వెళుతున్నట్టు బాంబు పేల్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అయితే విశాఖ ఏకైక రాజధాని అని ఇటీవల తేల్చేశారు. అయినా సరే రాజధాని విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వైసిపికి ప్రతికూల అంశమే. విద్యావంతులు, మేధావులు రాజధాని అంశం విషయంలోనే జగన్ సర్కార్ కు బాహాటంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అమరావతి రాజధాని పరిణామం ఓటర్లను ప్రభావితం చేస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖ నుంచి పాలన పేరుతో ఎన్నికల వరకు ప్రజలను మభ్య పెట్టగలిగితే వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కుతామని జగన్ భావిస్తున్నారు. ఇదే మంచి తరుణం అని ఆలోచిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. చంద్రబాబు అరెస్టు అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసులపై కేసులు వేస్తున్నారు. పాత కేసులను సైతం తిరగదోడుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో లోకేష్ ను సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన నైరాస్యం ఉంది. అయితే చంద్రబాబు అరెస్టుతో విపరీతమైన సానుభూతి లభిస్తుందని సర్వేలు తేల్చుతున్నాయి. నిఘవర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. సానుభూతిని కరిగించాలంటే ఏదో ఒక ఇష్యూ ని బయటకు తేవాలని భావించారు. విశాఖ నుంచి పాలన పేరుతో ప్రకటన చేశారు.
ప్రస్తుతం రాజధానుల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. డిసెంబర్లో విచారణకు వచ్చినా తుది తీర్పు మాత్రం వెలువడే అవకాశం లేదు. అటు విశాఖలో పరదాల చాటున నిర్మాణాలు పూర్తయ్యాయి. సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు సచివాలయాల నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేసు పెండింగ్లో ఉండగా విశాఖలో ఎటువంటి నిర్మాణాలు జరపవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా జగన్ పెడచెవిన పెట్టారు. దీని వెనుక కేంద్ర పెద్దల హస్తం ఉందన్న ప్రచారం కూడా ఉంది. అందుకే ధైర్యం చేసి విశాఖ నుంచి పాలన పేరిట జగన్ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు ఎలాగాలో నడిపించి.. మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత దూకుడుగా అడుగులు వేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.