Jagan- Cheerala Constituency: తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయ్యాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలను చెరదీశారు. అయితే లక్ష్యం ఎంతవరకూ వర్కవుట్ అయ్యిందో తెలియదు కానీ.. సీఎం జగన్ ఏరికోరి తలనొప్పులు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరామక్రిష్ణ, వల్లభనేని వంశీమోహన్, వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు మరో ఇద్దర్ని జగన్ వైసీపీలోకి చేర్చుకున్నారు. వారు వైసీపీలో చేరకున్నా.. ఆ పార్టీ అనుబంధంగా కొనసాగుతున్నారు. దాదాపు భౌతికంగా చేరినట్టే. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామన్న హామీతోనే వారిని పార్టీలో చేర్చుకున్నారు. గత ఎన్నికల్లోవారిపై వైసీపీ అభ్యర్థులుగా పోటీచేసిన వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. తోసిరాజని చంద్రబాబు, టీడీపీని దెబ్బకొట్టాలని జగన్ గట్టిగా డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి ఇలా చేరిన ఎమ్మెల్యేలు, పాత అభ్యర్థులు జగన్ కు గట్టి ఝలక్ ఇస్తున్నారు.

ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం విషయంలో జగన్ పడుతున్న వ్యధ అంతా ఇంతా కాదు. ఇక్కడ పార్టీలో మూడు వర్గాలు ఉన్నాయి. ముగ్గురూ బలమైన నేతలే. చీరాల అంటే ముందుగా గుర్తొచ్చే పేరు అమంచి కృష్ణమోహన్. ఈయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల్లో పార్టీ హైకమాండ్ టిక్కెట్ ఇవ్వకపోయేసరికి నవోదయ అనే పార్టీ పెట్టుకొని మరీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. నాడు టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. దీంతో చంద్రబాబు వ్యూహం మార్చారు. అనూహ్యంగా కరణం బలరాంను తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలో టీడీపీ ఓటమి చవిచూసినా చీరాలలో మాత్రం బలరాం విజయం సాధించారు. నాడు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పోతుల సునీతకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఇంతలో పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా బలరాంకు వైసీపీలోకి రప్పించారు. దీంతో ఏకంగా నియోజకవర్గంలో ముగ్గురు నాయకులు అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మాకంటే మాకు అన్న రేంజ్లో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.

సమస్యను పరిష్కరించాలని చూస్తున్న జగన్ అమంచి కృష్ణమోహన్ కు పర్చూరు నియోజకవర్గానికి లైన్ క్లీయర్ చేశారు. రామనాథం బాబు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్నా.. కృష్ణమోహన్ ను కూడా అదనపు ఇన్ చార్జిగా ప్రకటించి పర్చూరు నుంచి పోటీ చేయాలని పరోక్ష సంకేతాలిచ్చారు. కానీ అమంచి మాత్రం తనకు చీరాలలోనే బలం ఉందని.. ఇక్కడ నుంచే పోటీచేస్తానని పట్టుబట్టి కూర్చున్నారు. ఇక్కడ పద్మశాలి, బలిజ సామాజికవర్గం ఎక్కువ. వారిలో అమంచికి మంచి పట్టుంది. అందుకే ఆయన బెట్టు వీడడం లేదు. మరోవైపు పోతుల సునీత సైతం తాను పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. అటు అద్దంకి నుంచి పోటీచేయాలని కోరుతుంటే బలరాం కుటుంబసభ్యలు ససేమిరా అంటున్నారు. ఈసారి బలరాం కుమారుడు వెంకటేష్ పోటీచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు అమంచి సైతం అవసరమైతే పార్టీని వీడుతానని.. లేకుంటే ఇండిపెండెంట్ గా నైనా బరిలో దిగుతానని అల్టిమేటం ఇస్తున్నారు. ఏ ఒక్కరికి టిక్కెట్ ప్రకటించినా మిగతా ఇద్దరి నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది. ఈ మూడు ముక్కలాటలో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.