Kapu Reservation- Jagan: కాపుల రిజర్వేషన్ అమలు విషయంలో జగన్ అడ్డంగా దొరికిపోయారా? చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలుచేయాల్సిందేనా? మూడున్నరేళ్లుగా తప్పించుకున్నా…ఇక అమలుచేయక తప్పదా? కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు జగన్ స్టెప్ ఏమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డం పెట్టుకొని జగన్ కాలం గడుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో అమలు చేయడం అనివార్యంగా మారింది. ఒక వేళ చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తే… నాలుగేళ్ల పాటు కాపులకు రిజర్వేషన్ ఫలాలు దూరం చేసినట్టు ఒప్పుకున్నట్టవుతుంది. దానికంటే మెరుగైన శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మిగతా వర్గాలు దూరమయ్యే అవకాశముంది. దీంతో ఏ నిర్ణయమూ తీసుకోలేక జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు.

కాపులకు ఎనెన్నో హామీలిచ్చిన జగన్ వారి అభిమానాన్ని చూరగొన్నారు. గత ఎన్నికల్లో మెజార్టీ కాపులు జగన్ కు అండగా నిలిచారు. పవన్ జనసేనబరిలో ఉన్నా చాలా నియోజకవర్గాల్లో కాపులను మభ్యపెట్టి వైసీపీ తన వైపు తిప్పుకుంది. ఎన్నికల్లో అండగా నిలిచారన్న కనీసం విశ్వాసం లేకుండా.. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు సర్కారు కాపులకు ఇచ్చిన ఈబీసీ 5 శాతం రిజర్వేషన్ ను రద్దుచేశారు. కాపులు తమను బీసీ జాబితాలో చేర్చాలని అడిగితే చంద్రబాబు ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం ఏమిటని ప్రశ్నించారు. దానికి చట్టబద్ధత లేదని తేల్చేశారు. ఇలా అయితే కాపులు ఎప్పటికీ బీసీలుగా మారరని.. ఈబీసీలుగానే మిగిలిపోతారని సరికొత్త వక్రభాష్యం చెప్పారు. గత మూడున్నరేళ్లుగా పాడిందే పాటు అన్నట్టు అదే మాట చెబుతున్నారు. అయితే ఇటీవల ఎంపీ జీవీఎల్ నరసింహరావు కాపుల రిజర్వేషన్ అమలు విషయమై పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్న కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై సంబంధిత మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని.. దానిని అమలుచేసే హక్కు, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని చెప్పడంతో బాల్ నేరుగా వచ్చి జగన్ సర్కారు కోర్టులో పడింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా మారింది.
దశాబ్దాలుగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని గట్టి పోరాటమే జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో తుని విధ్వంస ఘటనల తరువాత కాపుల రిజర్వేషన్లపై అధ్యయనానికి మంజునాథ కమిషన్ ఏర్పాటుచేశారు.ఇంతలోగా 5 శాతం ఈబీసీ రిజర్వేషన్ అమలుచేయాలని నిర్ణయించారు. అసెంబ్లీలో తీర్మానించి ఆమోదించారు. అమలు కోసం ప్రత్యేక జీవో ఇచ్చారు. గవర్నర్ చే ఆమోదముద్ర వేయించి కాపులకు ఈబీసీ సర్టిఫికెట్లు జారీ చేశారు.అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైసీపీ అంతులేని విజయంతో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లవని రద్దుచేసింది. అయితే వైసీపీ మంచి ఊపు మీద ఉండడంతో కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు. దాని గురించి మాట్లాడేందుకు కూడా సాహసించలేదు.

కానీ ఇప్పుడు కేంద్రం కాపులకు చంద్రబాబు కల్పించిన రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేయడంతో జగన్ అండ్ కో నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. ఇప్పుడు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు. చంద్రబాబు మాదిరిగా ఐదు శాతం ఇస్తే కొత్తగా ఏమిచ్చారని.. పైగా నాలుగేళ్ల పాటు తమ రిజర్వేషన్ ఫలాలను దూరం చేశారని కాపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతాయి. ఇప్పటికే జయహో బీసీ అంటూ పొలి కేకలు పెట్టడంతో కాపులకు ఎక్కువ శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పిస్తే వారు ఊరుకోరు. అలాగని సైలెంట్ గా ఉండిపోదామంటే కుదరదు. తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే రాజకీయంగా ప్రతికూలతలు వస్తాయన్న భయం వెంటాడుతోంది. సో సవ్యంగా ముందుకు సాగాల్సిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లను కేవలం చంద్రబాబు ప్రకటించారన్న ఒకే ఒక్క కారణంతో రద్దుచేశారు. ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నారు.