Jagan vs Pawan kalyan: రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఎట్టకేలకు మొదలై విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన అధికారంలోని వైసీపీ ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎక్కడికెళ్లినా విపరీతంగా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. క్రౌడ్ పుల్లర్ గా పేరు సంపాదించుకున్నారు. వస్తున్న స్పందన చూసి అదిరిపడిన ముఖ్యమంత్రి జగన్ స్పందించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన సభలో ప్రభుత్వ కార్యక్రమమైనా పవన్ ను విమర్శించడం విమర్శలకు దారితీసింది.
ముందస్తుగా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రాయలసీమ నుంచి ప్రారంభమైన అనంతరం రూట్ మ్యాప్ ప్రకారం ఆయన యాత్ర చేపట్టిన నియోజకవర్గాల్లో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను సైతం విమర్శించుకుంటూ వస్తున్నారు. పలుచోట్ల వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన వ్యాఖ్యలపై నిరసన తెలియజేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం పవన్ చేపడుతున్న వారాహి యాత్రలో ఆ మేరకు నిరసనలు కానరాకపోవడం గమనించదగ్గ విషయం.
పవన్ వారాహి యాత్ర చేపట్టిన తరువాత ఏకంగా ముఖ్యమంత్రి జగన్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ శ్రేణులు లోకేష్ ను పక్కనబెట్టి పవన్ ను విమర్శించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయనపై మూకుమ్మడిగా మాటల దాడి చేస్తున్నారు. దాంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జగన్ vs పవన్ లా మారిపోయింది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి పత్రికల్లో సైతం కనిపిస్తోంది. జగన్ కూడా పవన్ పై డోసు పెంచి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో లోకేష్ క్రమేణా మీడియాలో సైతం కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో పవన్ గ్రాఫ్ బాగా పెరిగిపోయి, లోకేష్ యువగళం చిన్నబోతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాలు, షూటింగ్ బిజీలో ఉండి వారాహి యాత్ర ప్రారంభించడానికి కాస్త లేటు చేశారు గాని, అదే లోకేష్ కంటే ముందుగానే యాత్ర ప్రారంభించి ఉంటే యువగళం యాత్రకు జనాదరణ బాగా తగ్గి ఉంటుందేమోనని పలువురు భావిస్తున్నారు. పైగా టీడీపీ అనుకూల మీడియా సైతం పవన్ కు మరింత ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన కార్యక్రమాలను కవర్ చేస్తే వస్తున్న రేటింగ్ అటువంటిది మరి. భవిష్యత్తులో ఈ పరిణామం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.