అసలుకే తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రాలకు అందించే ప్రాయోజిత పధకాలకు సంబంధించిన నిధులను సహితం భారీగా కోత విధిస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. ఈ విషయమై కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలదీయలేక పోవడంతో ప్రభుత్వానికి దిక్కు తోచడంలేదు.
కొన్ని పథకాల్లో నిధులను పెంచినట్లు చూపిస్తున్న కేంద్రం మరికొన్ని పథకాల్లో దారుణంగా కోతలు పెడుతోంది. దాంతో మొత్తం నిధుల్లో భారీగా గండి పడుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
రాష్ట్ర అభివృద్ధి పథకాలకు కేంద్ర సాయం చేసే నిధుల్లో ఇంకా రు.4,392 కోట్లు రావాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రు.13,925 కోట్లు వస్తాయని అంచనా వేయగా, ఇప్పటివరకు రు.9,533 కోట్లు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. మరో ఏడెనిమిది రోజులలో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావస్తు ఉండడంతో కేంద్రం ఈ నిధుల గురించి మాట్లాడక పోవడంతో రాష్ట్ర ప్రభుతానికి పాలుపోవడం లేదు.
ఇదే సమయంలో కీలకమైన 17 పథకాలకు సంబందించి వచ్చిన నిధులపైనా లెక్కలు తేల్చారు. అందులో తొమ్మిది పథకాల్లో భారీగా కోతలు పడగా, ఎనిమిది పథకాల్లో స్వల్పంగా నిధులు పెరిగాయి. అయితే పెరిగిన నిధుల కన్నా… కోతలు పడిందే ఎక్కువగా ఉన్నాయి. తొమ్మిది పథకాలకు గత ఏడాది రు.5,138 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,948 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే మొత్తం మీద రు.2,165 కోట్లు తగ్గాయి.
ఇందిరా ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజనల కింద రు.977 కోట్లు తగ్గగా, స్మార్ట్ సిటీలకు రూ.372 కోట్లు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) విభాగంలో రు.315 కోట్లు, ఉపాధి హామీ పథకంలో రు.304 కోట్లు కోతలు పడ్డాయి. రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంతవరకు కోతలు పడ్డాయి.
రూసా, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, స్వచ్ఛభారత్ మిషన్ (అర్బన్), విద్య, ఎస్‌ఎబిఎల్‌ఎ వంటి పథకాల్లో కూడా కొంత వరకు కోతలు పడ్డాయి. అయితే మరో ఎనిమిది పథకాల్లో మాత్రం స్వల్పంగా నిధులు పెంచారు. ఈ పథకాలకు సంబంధిరచి గత ఏడాది రూ1,785 కోట్లు రాగా, ఈ ఏడాది రు.2,432 కోట్లు వచ్చాయి.
అంటే రు.647 కోట్లు అదనంగా వచ్చాయి.
మొత్తం రావాల్సిన రు.13,925 కోట్లలో ఎక్కువ స్థానిక సంస్థలకు సంబందించినవి కాగా, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, గృహనిర్మాణం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోతలు తీవ్రంగా వున్నాయి.