AP Govt Teachers: ఏపీలో వైసీపీ సర్కారు ఉపాధ్యాయులకు షాకిచ్చింది. వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త వ్యవస్థను అమలుచేస్తోంది. ఉపాధ్యాయుల హాజరు విషయంలో కొత్తగా యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. వారి అటెండెన్స్ విషయంలో ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ ఉన్న బయోమెట్రిక్, ఐరీష్ స్థానంలో ఫేస్ యాప్ ను ప్రవేశపెట్టింది. నిర్థేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ రోజు సెలవు దినంగా పరిగణించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. మంగళవారం నుంచే దీనిని పటిష్టంగా అమలుచేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు భగ్గుమంటున్నాయి. ఉపాధ్యాయుల హక్కులను నిర్వీర్యం చేసేలా.. కక్షసాధింపునకు ప్రభుత్వం దిగుతోందని వారు ఆరోపిస్తున్నారు. మిగతా శాఖల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం హక్కుల కోసం గళమెత్తుతున్న తమపై ఉక్కుపాదం మోపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో..
ఆర్డిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ టెక్నాలజీతో ప్రభుత్వం సిమ్స్ ఏపీ యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరుకావడం లేదని.. బయోమెట్రిక్ విధానాన్ని సైతం పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. పారదర్శకత కోసమేనని చెప్పుకొస్తోంది. ముందుగా పాఠశాలల ప్రధానోపాధా్యయులు యాప్ లో లాగిన్ అవుతారు. తరువాత ఉపాధ్యాయుల ముఖాన్ని మూడు కోణాల్లో అప్ లోడ్ చేసి హాజరు వేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో 12 రకాల యాప్స్ ను అందుబాటులోకి తెచ్చారు. కానీ వీటి వినియోగం విషయంలో అనేక సాంకేతిక అవరోధాలు ఎదురవుతున్నాయి. వాటిని నివృత్తి చేయడంలో కూడా అధికారులు విఫలమవుతున్నారు. ఇటువంటి సమయంలో మరో యాప్ ను అందుబాటులోకి తేవడంపై ఉపాధ్యాయవర్గాలు పెదవివిరుస్తున్నాయి. ముందస్తు అవగాహన కల్పించకుండా, అసలు పరికరాలే రాకుండా సిమ్స్ ఏపీ యాప్ ను అమలుచేయాలని ప్రభుత్వం భావించడం వెనుక ఉపాధ్యాయవర్గాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బయటపడుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.
Also Read: Director Shankar Daughter: ఆ హీరో తో నటిస్తే ఊరుకోను అంటూ కూతురుకి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్
డౌన్ లోడ్ చేసుకుంది కొద్దిమందే..
రాష్ట్రంలో 1.8 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారందరికీ ఏపీ సిమ్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పాఠశాల మంత్రిత్వ శాఖ సూచించింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ప్లేస్టోర్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? హాజరు ఎలా వేసుకోవాలి? అన్న మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. కానీ మంగళవారం ఉదయం నాటికి కేవలం 30 వేల మంది ఉపాధ్యాయులే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరో విషయం ఏమిటంటే ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల హాజరును సైతం ఈ యాప్ ద్వారే చేయాలని స్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకూ సగం మంది కూడా డౌన్ లోడ్ చేసుకోకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థుల హాజరు నమోదు విషయం గందరగోళం నెలకొంది. మంగళవారం నుంచి విధిగా అమలుచేయాలని ఆదేశాలు రావడంతో డౌన్ లోడ్ చేసుకోని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యాప్ నకు సంబంధించి పరికరాలేవీ అందుబాటులోకి రాలేదని అధికారులు చెబుతున్నారు.
భగ్గుమంటున్న గురువులు..
యాప్ పై ఉపాధ్యాయవర్గాల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పాఠశాల విలీన ప్రక్రియ, 117 జీవోను రద్దుచేయాలని గత కొద్దిరోజులుగా ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు సందట్టో సడేమియా అన్నట్టు యాప్ ను అందుబాటులోకి తేవడమే కాకుండా ఉన్నపలంగా అమలుచేయడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు స్మార్ట్ ఫోన్లు వినియోగించడం లేదని..అమలు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్కు సమస్య ఉందని..సకాలంలో విధులకు హాజరైనా సాంకేతిక సమస్యలతో యాప్ అప్ లోడ్ కాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ సర్కారు వరుసగా ఉపాధ్యాయులకు షాకిస్తూ వస్తోంది.