CM Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుల గణన చేపట్టనుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కుల గణనకు ముందుకొచ్చింది. కులాల వారీగా సర్వే చేపట్టడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. నవంబర్ 15న కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఆరు నెలల వ్యవధిలో కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంజాబ్, ఒడిస్సా ప్రభుత్వాలు కులాల వారీగా సర్వే చేపట్టాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఏపీ చేరనుంది.
గతంలో ఓసారి బీసీ గణన కోసం ప్రభుత్వం ఒక కమిటీని సైతం నియమించింది. ఇప్పుడు తాజాగా చేపట్టనున్న ఈ కుల గణన బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. వాలంటీర్లను మాత్రం పక్కకు పెట్టింది. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని తలచి ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలో ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి వారి వివరాలను సేకరిస్తారు. ఆ వివరాలను అధికారులు పున పరిశీలిస్తారు. మరోసారి కుల గణన వివరాలను సరిపోల్చి చూస్తారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించనున్నారు.
కులగనణ విషయంలో ఎటువంటి విమర్శలకు తావివ్వకూడదని ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. సర్వే సమయంలో ఆయా కుటుంబాల వారి నుంచి సేకరించిన డేటాను మొబైల్ యాప్ లో భద్రపరచనుంది. ప్రస్తుతం ఈ యాప్ రూపకల్పనలో యంత్రాంగం బిజీగా ఉంది. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
అయితే ఈ కులగణన విషయంలో సర్వే సకాలంలో పూర్తవుతుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మిగులుతోంది. ఎన్నికల చూస్తే పట్టుమని ఆరు నెలల వ్యవధి కూడా లేదు. సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే యంత్రాంగమంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఈ తరుణంలో కుల గణన సర్వే సాధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికల ముంగిట.. ఇదో ఎలక్షన్స్ స్టంట్ గా మిగిలిపోతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సర్వే సక్రమంగా జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా ఉంది. ఇప్పటికే ఏపీలో రాజకీయ పార్టీలు కులాల వారీగా విడిపోయాయి. ఈ తరుణంలో ఈ కుల గణనలో కొన్ని సామాజిక వర్గాలను తక్కువగా చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.