Jagan Ruled For 1000 Days : ఓటమి ఆయనను దెబ్బతీయలేదు. అధికారం కోసం పదేళ్లకు పైగా ఎదురుచూశాడు. తన టైం వచ్చాక.. ప్రజలు ఆదరించాక సీఎం కుర్చీలో కూర్చున్నారు. ప్రతిపక్షంలో ఉండగా అలుపెరగని బాటసారిగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 3వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూశాడు. వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చాడు. ప్రజల అభిమానం చూరగొని ఏపీ చరిత్రలోనే అద్భుత విజయం సాధించాడు. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలతో చరిత్ర సృష్టించాడు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా గద్దెనెక్కి నేటికి 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వెయ్యి రోజుల్లో ఎన్నో సమస్యలు, విపక్షాల ఆరోపణలు.. వివాదాలు, సంక్షోభాలు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ముందుకెళుతున్న సీఎం జగన్ పాలనపై ప్రత్యేక ఫోకస్..
దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019 మే 23న వెలువడ్డాయి. . టీడీపీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది.3 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచి సరిపెట్టుకుంది. టీడీపీ చరిత్రలోనే ఈరోజు ఘోరమైన ఓటమిగా చరిత్రలో నిలిచిపోయింది. వైసీపీ ఏపీలో తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చింది. మే 30న ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్, స్టాలిన్ వంటి సీఎంలు తోడుగా ఈ కార్యక్రమాన్ని ప్రజల సమక్షంలో నిర్వహించారు. ‘వైఎస్ జగన్ అనే నేను..’ అన్న మాటకు మొత్తం ప్రాంగణం మారుమోగిన సందర్భం అదీ. వైఎస్ విజయమ్మ కళ్లలో నీళ్లు సుడులు తిరిగిన నేపథ్యం అదీ. అలా గద్దెనెక్కిన జగన్ రెండేళ్లలో ఎన్నో పథకాలు, అభివృద్ధితో జనాలకు చేరువయ్యారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నేటికి 1000 రోజులు అవుతోంది. అందుకే ఆ పార్టీ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ అభిమానులు ఆనందోత్సాహాలతో ఈరోజును గుర్తు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో జగన్ ఫొటోలు పెడుతూ వెయ్యి రోజుల్లో జగన్ చేసిన పనులను పేర్కొంటూ వైరల్ చేస్తున్నారు.
జగన్ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. కడప జిల్లా ఇడుపులపాయలోని తండ్రి సమాధి నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఏపీ వ్యాప్తంగా సాగి 3648 కిలోమీటర్ల భారీ పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో జగన్ పాదయాత్రను విరమించారు. 2019 ఎన్నికల్లో సర్వేలు కూడా ఊహించని రీతిలో జగన్ కు ఏపీ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. టీడీపీని చావుదెబ్బ తీశారు. టీడీపీకి 39.18శాతం ఓట్లు రాగా.. అధికార వైసీపీకి 50శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. మే23న ఫలితాలు రాగా వారానికి 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నో కష్టాలు, జైలు జీవితం.. ఉమ్మడి ఏపీలో పార్టీని కాపాడి.. ఏపీ ప్రధాన ప్రతిపక్షగా నిలబడి చివరకు జగన్ అనుకున్నది సాధించారు. ఈ వెయ్యి రోజుల జగన్ ప్రస్థానాన్ని వైసీపీ నేతలు గుర్తు చేసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు.
చంద్రబాబు అప్పటికే ఏపీని అప్పుల కుప్పగా మార్చాడు. పోతూ పోతూ ప్రభుత్వ ఖజానాలోని ప్రతీ రూపాయిని ప్రజలకు పప్పూ బెల్లాల్లా పంచేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెత్తిపై 2 లక్షల కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చిన తను ప్రజలకు ఇచ్చిన హామీలను తూ.చా. తప్పకుండా అమలు చేశారు. నవరత్నాల నుంచి అన్నింటిని బడ్జెట్ లేకున్నా అప్పులు తెచ్చి .. సర్ధి.. ఆదాయ మార్గాలు అన్వేషించి పూర్తి చేస్తున్నారు. పింఛన్ నుంచి పథకాల వరకూ ఠంఛన్ గా అన్నింటిని లబ్ధిదారుల ఖాతాల్లో పడేస్తున్నారు.
ఏపీలో రోడ్ల దుస్థితి బాగా దిగజారిందన్న విమర్శ ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా అంత బాగా లేవు. ఇక జనసేన, టీడీపీలు ఏపీ రోడ్లపై చేస్తున్న రచ్చ అంతా ఇంతాకాదు. అందుకే బడ్జెట్ లేకున్నా అప్పులు తెచ్చి… కొన్ని రహదారులను కేంద్రం సాయంతో ఇప్పుడిప్పుడే సీఎం జగన్ పూర్తి చేయిస్తున్నారు. రోడ్ల దుస్థితిని బాగు చేస్తున్నారు.
Also Read: Analysis on National Politics: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?
కరోనా కల్లోలానికి అన్ని రాష్ట్రాల సీఎంలు అదిరిపోయారు.. బెదిరిపోయారు. కానీ దాన్ని ధీటుగా ఎదుర్కొన్నది ఒక వైఎస్ జగన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా టైంలోనూ ఆంక్షలు సడలించి ప్రజలను అ మహమ్మారి నుంచి రక్షించేందుకు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత ఖచ్చితంగా జగన్ దే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక జగన్ చేసిన పెద్ద సంస్కరణ.. విద్యావ్యవస్థనే. ఎంత మంది వ్యతిరేకించినా జగన్ అనుకున్నది సాధించాడు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు. దీనిపై ఎంత రచ్చ జరిగిందో మనం చూశాం. స్వయంగా ఉపరాష్ట్రపతి తెలుగును చంపేస్తున్నారని అన్నా జగన్ వెనక్కి తగ్గలేదు. తాజాగా సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టి మరో సంచలనానికి నాంది పలికాడు.
ఇక దేశంలోనే గొప్ప పాలన సంస్కరణగా జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ చరిత్రలో నిలిచిపోయింది. ఇది ఎంతలా హిట్ అయ్యిం దంటే ఐఏఎస్, ఐపీఎస్ లకు బోధన అంశంగా కూడా దీన్ని ప్రవేశపెట్టారని జగన్ సాధించిన ఘనతను అర్థం చేసుకోవచ్చు.
ఇక జగన్ పాలనలో అన్నింటికంటే ఎక్కువ కేటాయింపులు.. సక్సెస్ అయినవి నవరత్నాలు పథకాలు.. దీని ద్వారా లబ్ధిదారులకు నేరుగా డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడంతో ఇవి పేదలకు చేరువయ్యాయి.
ఇక సినిమా ఇండస్ట్రీతో జగన్ ప్రభుత్వం గొడవలు కాస్త చెడ్డపేరు తెచ్చాయనే చెప్పాలి. ఎంత మంది సీనీ ప్రముఖులు వచ్చి వేడుకున్నా సినిమా టికెట్ల రేట్లు, ఆన్ లైన్ టికెటింగ్ పై జగన్ సర్కార్ మొండి పట్టుదల ఇండస్ట్రీతో వైరానికి దారితీసింది. ఇప్పటికీ ఈ సమస్య అలాగే ఉండడం జగన్ పై విమర్శలకు తావిస్తోంది.
ఇక రాజకీయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ స్నేహాన్ని మెయింటేన్ చేస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీపై ఉక్కుపాదం మోపుతున్నారు. జనసేనతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీతో నిధుల కోసం కాస్త సామరస్యంగానే ఉంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం వెల్లడం లేదు.
న్యాయవ్యవస్థతో జగన్ తన పాలనలో పెట్టుకొని జాతీయ స్థాయిలో దుమారం రేపారు. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తితోనే పెట్టుకొని వివాదాస్పదమయ్యారు. కొన్ని విషయాల్లో జగన్ ఎవ్వరి మాట వినకుండా మొండిగా వ్యవహరించారు. ఇప్పటికీ పలు విషయాల్లో జగన్ పట్టుదలకు పోవడం మైనస్ గా చెప్పొచ్చు.
*అభివృద్ధి కోణం
– అధికారం చేపట్టిన తొలి నాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి గ్రామస్వరాజ్యాన్ని జగన్ నెలకొల్పారు. దీనికి దేశవ్యాప్తంగా గుర్తింపు ప్రశంసలు దక్కాయి.
– వలంటీర్ల వ్యవస్థతో ఏకంగా 4.5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలను అందిస్తూ ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు.
-పెన్షన్ మొదలు ఏ పథకమైనా గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు.
-రాష్ట్రంలో 11152 గ్రామ సచివాలయాలు, 3913 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే లక్షలమంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు.
-అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్ఆర్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాలు జగన్ ను ప్రజలకు చేరువ చేశాయి.
మొత్తంగా జగన్ 1000 రోజుల పాలనలో అభివ్రుద్ధి కోణం బాగానే ఉంది. పేదలకు కావాల్సినంత సంక్షేమ పథకాలు అందాయి. అయితే రాజకీయ వివాదాలు, హైకోర్టు తీర్పులు, సినీ ఇండస్ట్రీతో గొడవ, సుప్రీంకోర్టు జడ్జితో వివాదం మైనస్ గా చెప్పొచ్చు.
Also Read: Botsa Satyanarayana: తాము లోకువ అయ్యామంటున్న బొత్స.. సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారంట..!