తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కొవిడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఆయన కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఏపీ సీఎం జగన్ కూడా కరోనా జాగ్రత్తల విషయంలో కొంచం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేక విమర్శలకు తావిస్తోంది. ఆయన ముఖానికి మాస్క్ ధరించడానికి అంతగా ఆసక్తిగా లేరని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మాస్క్ ఎందుకు ధరించడం లేదో ప్రెస్ మీట్ లో విలేకరులు ప్రశ్నించాలని సూచించారు.
ట్రైనీ ఐఏఎస్ లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను, రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. వీటికి సంబంధించి పత్రికల్లో పక్కపక్కనే ఫొటోలు ప్రచురించారు. ఈ ఫొటోల్లో రాజ్ భవన్ లో గవర్నర్ తో పాటు ట్రైనీ ఐఏఎస్ లు మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించి కొవిడ్ నిబంధనలు తూచా తప్పక అమలు చేయడం కళ్లకు కట్టినట్టు కనిపించింది.
సీఎం జగన్ ను కలిసిన సందర్భంలో కరోనా నిబంధనలను ఏ మాత్రం పాటించలేదు. సీఎం జగన్ సహా యువ ఐఏఎస్ లు కూడా మాస్క్ లు ధరించకపోవడంతో పాటు భౌతిక దూరం పాటించలేదు. పాలకుడి ప్రతి నడవడికను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. సాక్ష్యాత్తు సీఎం జగనే కొవిడ్-19 నిబంధనలు పాటించకపోతే…సామాన్యులకేం సందేశాన్ని పంపుతారు?