
Jagan Meets Amit Shah: ఏపీ సీఎం జగన్ తరచూ ఢిల్లీ వెళుతుంటారు. బీజేపీ పెద్దలను కలుస్తుంటారు. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుంటారు. పోలవరం నుంచి ప్రత్యేక హోదా..ఇలా అన్ని అడిగినట్టు అందులో పేర్కొంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ టూర్ సమయంలో విడుదల చేసే ప్రతీ ప్రెస్ నోట్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంతో ఢిల్లీ మీడియా కూడా జగన్ పర్యటనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం మానేశాయి. తాజాగా బుధవారం జగన్ ఢిల్లీ వెళ్లారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో అమిత్ షా నుంచి పిలుపు రావడంతో వెళ్లి అరగంట పాటు చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలిసినట్టు పేర్కొన్నారు. సేమ్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో పాత విషయాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే అర్ధరాత్రి అమిత్ షాను ఎందుకు కలిశారన్నదే ఇప్పుడు ప్రశ్న.
వివేకా హత్య గురించి చర్చించేందుకేనా?
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చురుగ్గా వ్యవహరిస్తోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డి పాత్రపై ఇప్పటికే సీబీఐ స్పష్టతనిచ్చింది. వారిద్దర్నీ అరెస్ట్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ కేసులో విచారణ అధికారిని తప్పించాలని నిందితుల కుటుంబసభ్యులు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించింది.అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డిని కాపాడాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపణలున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్ అమిత్ షాను కలవడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేసులో తదుపరి అడుగు వేసేందుకు అమిత్ షా సాయం కోరి ఉంటారని ఎక్కువ మంది భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు గురించి చర్చించేందుకు కలిశారని.. తెలంగాణతో పాటే ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరినట్టు విశ్వసనీయ సమాచారం.
రెండు వారాల్లో రెండుసార్లు…
జగన్ రెండు వారాల్లో రెండుసార్లు కేంద్ర పెద్దలను కలిశారు. వారం తిరగక ముందే రెండోసారి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సీరియస్ ఇష్యూష్ ఉంటే తప్ప కేంద్ర పెద్దలు కూడా కలవరు. కానీ ఇప్పుడు అమిత్ షాను కలిసిన వెంటనే మళ్లీ పాత పాటే పాడుతున్నారు. అమిత్ షా కేంద్ర హోంమంత్రి మాత్రమే. ఆయనకు పోలవరం నిధులతో సంబంధం ఉండదు. కానీ జగన్ అడిగినట్లుగా ప్రచారం చేసుకుటున్న వాటిలో అన్ని శాఖల విజ్ఞప్తులు ఉన్నాయి. అమిత్ షాతో భేటీకి జగన్ అజెండా వేరు. ప్రజల్ని మభ్య పెట్టేందుకు చేస్తున్న ప్రచారం వేరని తేలిపోతుంది. అసలు హోంమంత్రితో అర్థరాత్రి సమావేశం కావాల్సిన అర్జంట్ మ్యాటర్ ఏమిటనేది ప్రజలకు తెలియకూడదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అమిత్ షా .. అధికారిక సమావేశాలు రాత్రి సమయాల్లో నిర్వహించరు. పార్టీ పరమైన వ్యవహారాలకే సమయం కేటాయిస్తారని అంటున్నారు. రాజకీయాల కోసమే జగన్ అమిత్ షాను కలిసి ఉంటారన్న భావన వ్యాపిస్తోంది.

ఎందుకు కలిశారో తెలియనివ్వరు…
జగన్ ఢిల్లీ పర్యటించిన ప్రతిసారి ఎన్నోరకాల ప్రయోజనాలు పొందుతుంటారు. అవి రాష్ట్రం కోసం మాత్రం కావు.తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తరచూ కేంద్ర పెద్దలను కలుస్తుంటారు. కానీ అవేవీ తెలియనివ్వరు. అలాగని కేంద్ర పెద్దలు సైతం స్పష్టతనివ్వరు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కారణాలు హైలెట్ అవుతుంటాయి. అయితే తనకు బీజేపీ మద్దతు ఉందని చెప్పేందుకు కూడా జగన్ ఎక్కువగా ఆరాటపడుతుంటారు. అయితే అల్టిమేట్ గా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే నష్టం చేకూరుస్తున్నాయి. ప్రజాధనంతో పర్యటనలు సాగించే పాలకులు దేని గురించి పెద్దలను కలిశామో స్పష్టతనివ్వాల్సిన అవసరముంది. కానీ అవేవీ అక్కర్లేదు అన్నట్టు సీఎం జగన్ తన పని తాను చేసుకుంటున్నారు. అసలు విషయాలు ప్రజలకు తెలియనివ్వడం లేదు.