
Jagan- Vijayasai Reddy: వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డిది ఆ పార్టీలో ప్రత్యేక స్థానం. పార్టీలో నంబర్ 2 గా గుర్తింపు సాధించారు. కానీ ఇటీవల ఆయనకు పార్టీలో ప్రాధాన్యం చాలావరకూ తగ్గించేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తారకరత్న మరణం తరువాత ఏకంగా అనుమానపు చూపులే ప్రారంభమయ్యాయి, ఆయన వ్యవహార శైలి కూడా సంచలమవుతోంది. తారకరత్న మరణంపై వైసీపీ ఓ స్ట్రాటజీతో వెళుతోంది. లక్ష్మీపార్వతితో ఆ పార్టీ ఆరోపణలు చేయించింది. వాటినే సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆ స్థాయిలో రియాక్టు కాలేదు. ఏదో స్పందించాలన్న రీతిలో కలుగజేసుకున్నారు. లక్ష్మీపార్వతితో పాటు ఇతర వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మాటలను గుర్తుచేసి ఎటాక్ చేశారు. ఇప్పడది వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టింది.
విజయసాయిరెడ్డి వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతానికి భిన్నంగా ఆయన శైలి ఉంది. తారకరత్న తన సమీప బంధువు కావడంతో అన్నీతానై వ్యవహరించడంలో తప్పు కాదు. తారకరత్న తన భార్య చెల్లెలి అల్లుడు కావడంతో కుటుంబసభ్యుడిగా అండగా నిలబడడాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. దానిని రాజకీయ కోణంలో చూడవద్దని విజయసాయి అనుచరులు కోరుతున్నారు. అయితే గతంలో ఈ స్థాయిలో సెంటిమెంట్లను విజయసాయిరెడ్డి పట్టించుకోలేదు. గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. తారకరత్న ఎపిసోడ్ కంటే ముందుగానే సోషల్ మీడియాకు పనిచెప్పడం మానేశారు. బొత్తిగా ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేయడం లేదు.
దాదాపు తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ రెండు రోజులు అక్కడే గడిపారు. అన్ని పార్టీల నాయకులు, సినీ ప్రముఖులతో మాట్లాడారు. అయితే అవన్నీ ఒక ఎత్తు చంద్రబాబు ఒక ఎత్తు. ఆయనతో పక్కనే కూర్చొని ముచ్చటించారు. కలిసే విలేఖర్లతో మాట్లాడారు. తిరిగి వెళ్లేటప్పుడు కారు వద్దకు వెళ్లి సాగనంపారు. సహజంగా అటువంటప్పుడు రాజకీయాలు మాట్లాడుకోరు. కానీ తన వ్యవహార శైలి వైసీపీ నాయకత్వానికి చికాకు తెప్పిస్తుందని తెలుసు. ఈ తరహా రాజకీయాలు తమ పార్టీకి అలవాటన్న విషయం తెలియని వ్యక్తి కాదు విజయసాయిరెడ్డి. కానీ ఏదో గట్టి సంకేతమే పంపించాలన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా వ్యవహరించారన్న టాక్ నడుస్తోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి విజయసాయిరెడ్డిది యాక్టివ్ రోల్. రాష్ట్రంలోనైనా.,.,జాతీయ స్తాయిలోనైనా పార్టీ కార్యక్రమాల్లో విజయసాయి ఉండాల్సిందే. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఎంతలా కష్టపడాలో అంతలా పడ్డారు. మల్టీ టాస్క్ తో పార్టీని విజయతీరాలకు చేర్చడంలో విజయసాయిది ప్రధాన భూమిక. అటువంటి విజయసాయి రెడ్డి స్థానాన్ని సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆక్రమించేశారు. సోషల్ మీడియా విభాగానికి సైతం విజయసాయిని తప్పించి కుమారుడు భార్గవ్ ను ఇప్పించుకోగలిగారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ వైపు కూడా విజయసాయి కనిపించడం లేదు. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీ టూర్ లో విజయసాయి కనిపించినా.. ఆయన్ను పెద్దగా పట్టించుకలేదు. వీటన్నింటికీ తారకరత్న ఎపిసోడ్ కారణం కాదు. అంతకు ముందు నుంచి జరుగుతున్న పరిణామాల ఫలితమేనని తెలుస్తోంది. మొత్తానికైతే విజయసాయి విషయంలో వైసీపీ అనుమానాలు పెరిగాయి. మరి ఇవి ఎంతదూరం తీసుకెళతాయో చూడాలి మరీ..