Jagan Egg Campaign: జగన్ ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. అక్కడా,ఇక్కడా అన్న తేడా లేకుండా పార్టీ రంగులు వేయడమే పనిగా పెట్టుకున్నారు. చివరకు బడులు, గుడులను సైతం విడిచిపెట్టలేదు. కోర్టులు మొట్టికాయలు పెట్టినా పెడచెవిన పెడుతున్నారు. వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఇష్టారాజ్యంగా రంగులు వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా చిన్నారులకిచ్చే కోడిగుడ్డుపై కూడా తమ ముద్రను వేస్తున్నారు.
అంగన్వాడి కేంద్రాల్లో బాలింతలకు, చిన్నారులకు కోడిగుడ్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఏ ప్రభుత్వం కూడా పథకం పై పెద్దగా ప్రచార ఆర్భాటం చేయలేదు. కానీ ఏకంగా కోడిగుడ్లపై తండ్రీ ,కొడుకులు ముద్ర వేయడం జగన్ కే చెల్లుబాటు అయ్యింది. వైయస్సార్ సంపూర్ణ పోషణ క్రింద ఇచ్చే గుడ్లపై వైయస్సార్ ఎస్పీ అని.. జగనన్న గోరుముద్దు కింద అందించే గుడ్లపై జేజిఎం అని ముద్ర వేసి పంపిణీ చేస్తున్నారు. తండ్రి కొడుకుల పేర్లు స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయడం గమనార్హం.
గుడ్లు పంపిణీని జగన్ పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల 76000 మంది అంగన్వాడి లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో బాలింతలు, గర్భిణీలు కూడా ఉంటారు. అయితే ఎక్కువ మంది చిన్నారులే. వైయస్సార్ పోషణ కింద ప్రతినెల 25 చొప్పున కోడిగుడ్లు అందిస్తారు. ఎన్నికల చివరి ఏడాది కావడంతో జగన్ కన్ను ఈ కోడిగుడ్లపై పడింది. సంపూర్ణ పోషణపథకాన్ని షార్ట్ కట్ చేసి వైయస్సార్ ఎస్పీ అంటూ కోడిగుడ్లపై ముద్రించి పంపిణీ చేస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు అందించే గుడ్లపై పింక్ కలర్, పది నుంచి 20వ తేదీ మధ్య సరఫరా చేసే గుడ్లు పై బ్లూ కలర్, 21 నుంచి సరఫరా చేసే గుడ్లపై గ్రీన్ కలర్ వేసేవారు. కానీ ఇప్పుడు వైసీపీ పోలిన రంగులను మాత్రమే వేస్తున్నారు. దీనిపైనే పెద్ద దుమారం రేగుతోంది.