Pawan Kalyan- Jagan: రేపు అనేది లేదు.. ఉంటే గింటే అది కూడా మాదే అన్నట్టు సాగుతోంది కొందరు వైసీపీ నేతల వ్యవహార శైలి. తాము కూర్చొన్న చెట్టు కొమ్మనే నరుక్కున్నట్టుంది వారు వ్యవహరిస్తున్న తీరు. హైకమాండ్ ప్రయోజనాల కోసం వారి రాజకీయ భవిష్యత్ ను పణంగా పెడుతున్నారు. బలి పశువులవుతున్నారు. ఏపీ సీఎం జగన్ చేసే పాలిట్రిక్స్ తెలియని కావు. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇది జగమెరిగిన సత్యం. అందుకే అంతులేని విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. పార్టీ నేతలను బలిచేసి.. వారి రాజకీయ భవిష్యత్ సమాధులపై నుంచే తన రాజకీయ వారధి నిర్మించుకున్న పవర్ ఫుల్ పొలిటీషియన్ జగన్. వైసీపీ ఆవిర్భావం నుంచి శ్రమటోడ్చిన ఎంతో మంది నాయకులు అడ్రస్ లేకుండా పోయారు. అనామకులైపోయారు. ఎంతో వీర విధేయత ప్రదర్శించి వారికి సైతం శంకరగిరి మాన్యాలు పట్టించిన ఘనత ఆయనది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ బలి పశువులను తయారు చేసుకోవడంలో జగన్ దిట్ట. ఎప్పటికప్పుడు కొత్త బలిపశువులు తెరపైకి రావడం.. తరువాత కనుమరుగై పోవడం ఆ పార్టీలో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది.

పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ దిగుతున్న వారి జాబితా వైసీపీ చాంతాడంత ఉంది. కానీ ముందు వరుసలో ఉండేది మాత్రం మంత్రి గుడివాడ అమర్నాథ్. పవన్ ప్రభుత్వ పాలసీలను విమర్శించినప్పుడు వాటిని నివృత్తి చేయరు. వివరణ ఇచ్చే ప్రయత్నానికి దిగారు. కౌంటరు ఇవ్వాలని ప్రయత్నించి.. తమకు అలవాటైన వ్యక్తిగత కామెంట్లకు దిగుతారు. అటు తాడేపల్లి నుంచి కూడా అటువంటి ఆదేశాలే వస్తాయి. వాటిని మన సలహాదారులు చూసుకుంటారు. మీరు పవన్ ఉతికి అరెయ్యాండంటూ ఆదేశాలిస్తారు. అయితే దీనికి పవన్ సామాజికవర్గానికి చెందిన వారినే ప్రయోగిస్తారు. అయితే అమర్నాథ్ జెట్ స్పీడుతో స్పందిస్తారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యే..ఆపై మంత్రి పదవి దక్కేసరికి భూమి మీద నిలబడలేకపోతున్నారు. బుగ్గ కారు, చుట్టూ మందీ మర్భాలం చూసేసరికి జగన్ తరువాత అంతటి రేంజ్ తనదేనన్న భ్రమలో బతికేస్తున్నారు. అందుకే పవన్ పై వ్యక్తిగత కామెంట్ల డోసు పెంచుతున్నారు. తానూ అబాసుపాలవుతున్నారు. అమర్నాథ్ పై సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి జాలిపడుతున్న వారూ ఉన్నారు.
అమరావతి రైతులు తమ మానాన తాము పాదయాత్ర చేసుకుంటున్నారు. అమరావతి నుంచి రాజమండ్రి అడుగు పెట్టే వరకూ వారి పాదయాత్ర సవ్యంగానే సాగింది. కవ్వింపు చర్యలకు దిగినా భౌతిక దాడులకు మాత్రం దిగే సహసం వైసీపీ నేతలు చేయలేదు. తొలిసారిగా రాజమండ్రిలోనే ప్రతిఘటన, దాడులు ఎదురయ్యాయి. అయితే ఈ వివాదంలో ఇప్పుడు ఎంపీ మార్గాని భరత్ చిక్కుకోవడం జాలేస్తోంది. ఆయన సహజ శైలికి భిన్నంగా వ్యవహరించినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. భరత్ స్వతహాగా సౌమ్యుడు. తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యారు. ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్ ఉందన్న కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన బరెస్టయ్యారు. అయితే అధిష్టానం కూడా తమ ఆదేశాలు పాటిస్తే మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని ప్రచారం కల్పించడంతో యువ నాయకులు అనవసర విషయాలకు రియాక్టవుతున్నారు. వివాదాలకు కార్నర్ అవుతున్నారు. రాజకీయ భవిష్యత్ ను చేజేతులా పాడుచేసుకుంటున్నారు.

అయితే చాలామంది యువ నాయకులే కొత్త బలిపశువుల జాబితాలో ఉండడం విశేషం. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ.. ఇలా నేతలందర్నీ ఓ పద్దతి ప్రకారం వైసీపీ అధిష్టానం వాడేసుకుంటోంది. అయితే రేపటి పరిస్థితి ఏమిటన్నది వీరికి అర్ధమవుతుందా? లేక పరిస్థితులు అవే సర్దుకుంటాయి కదా? అన్న నిర్ణయానికి వస్తున్నారేమో కానీ.. వారు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. పొరపాటున వైసీపీ ఓడితే మాత్రం రాష్ట్రంలో ఉండలేని ఏరికోరి పరిస్థితులను వీరు కొని తెచ్చుకుంటున్నారు.వైసీపీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తున్న వీరికి రాజకీయ శత్రుత్వంతో పాటు సామాజిక వ్యతిరేకత కూడా అధికంగా ఉంది. మొన్న విశాఖ ఎయిర్ పోర్టు ఉదంతం కూడా ఈ అసహనం నుంచి పుట్టుకొచ్చిందే. జనసేన శ్రేణుల దాడి వరకే చూస్తున్నారు. కానీ ఆ పరిస్థితి అంతలా ఎందుకొచ్చిందన్న ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. అధిష్టానం తమను బలిపశువు చేస్తుందని గుర్తించలేకపోతున్నారు.