CM Jagan: జగన్ ను భయపెట్టేది అదే!

2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు తెలిపింది. దీంతో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిస్తే అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : November 23, 2023 10:54 am

CM Jagan

Follow us on

CM Jagan: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. బిజెపి అంతరంగం మాత్రం అంతు పట్టడం లేదు. బిజెపి కేంద్ర నాయకత్వం ఇప్పటికీ జగన్ సర్కార్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుంది. రాష్ట్ర బిజెపి మాత్రం వైసిపి ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తోంది. ఈ తరుణంలో కేంద్ర పెద్దలు మనసు మార్చుకుంటారన్న భయం జగన్ ను వెంటాడుతోంది.

2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు తెలిపింది. దీంతో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ మూడు పార్టీలు కలిస్తే అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. వాస్తవానికి టిడిపితో జనసేన జత కట్టడమే వైసీపీకి ఒక షాక్. ఎట్టి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు కలవని జగన్ భావించారు. బిజెపి కలవనివ్వదని ఊహించారు. కానీ అంచనాలను అధిగమిస్తూ రెండు పార్టీలు ఒకటయ్యాయి. వీరికి గానీ బిజెపి తోడైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్ ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాతే బిజెపి తన స్ట్రాటజీని వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిజెపి పునరాలోచనలో పడుతుంది. చంద్రబాబుతో చేతులు కలిపేందుకు సిద్దపడుతుంది. ఒకవేళ బిజెపికి కానీ మంచి ఫలితాలు దక్కితే.. ఆ పార్టీ ఏపీలో మరో ఆలోచన చేసే అవకాశం ఉంది. బీసీ సీఎం నినాదంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. అక్కడ కానీ సానుకూల ఫలితాలు వెల్లడైతే ఏపీలో షరతులతో టీడీపీతో పొత్తుకుదుర్చుకునే అవకాశం ఉంది. రాష్ట్ర బిజెపి నేతల తీరు, ఎల్లో మీడియా కథనాలు చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతుందన్న అనుమానం కలుగుతోంది. దీనికి డిసెంబర్ 3 తర్వాతే క్లారిటీ రానుంది.

టిడిపి, జనసేనతో బిజెపి కలిస్తే తనకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని జగన్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి మాదిరిగా కేంద్రం సహాయ నిరాకరణ చేసి… ఎన్నికల్లో కట్టడి చేస్తుందని.. అందుకే ఈ నాలుగు సంవత్సరాలు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించాల్సి వచ్చిందని జగన్ భావిస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎవరికి కేంద్రం సహకారం లభిస్తే వారే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఒకవేళ బిజెపి కూటమిలోకి వస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ వారికి మద్దతు తెలిపే ఛాన్స్ ఉంది.ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు తిరుగుతారు. ఎలక్షన్లో కూటమికి మద్దతుగా నిలుస్తారు. ఇప్పుడు ఈ భయాలన్నీ జగన్ ను వెంటాడుతున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.