Nara Lokesh
Nara Lokesh: వచ్చే ఎన్నికల్లో అమరావతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అవుట్ కానున్నారా? పార్టీ హై కమాండ్ ఉద్వాసన పలకనుందా? కొత్త అభ్యర్థిని బరిలో దించే అవకాశం ఉందా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే టిడిపి యువనేత లోకేష్ మరోసారి మంగళగిరి నుంచి బరిలో దిగడం ఖాయం అయ్యింది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గ నుంచి పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసితో లోకేష్ పనిచేస్తున్నారు.
అయితే ఈసారి వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉంటారా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రామకృష్ణారెడ్డి పై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని హై కమాండ్ గుర్తించింది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయనపై అసంతృప్తి పెరిగింది. ఇటీవల వరుస సర్వేల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పై ప్రతికూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే హై కమాండ్ అక్కడ అభ్యర్థిని మార్చాలన్న బలమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే గంజి చిరంజీవితో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని మంగళగిరి నుంచి బరిలో దింపుతారని సమాచారం.
మంగళగిరి నియోజకవర్గంలో బీసీ జనాభా అధికం. చేనేత వర్గాలు ఎక్కువగా ఉంటారు. ప్రధానంగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారికి టిక్కెట్ ఇస్తే నారా లోకేష్ ను ఓడించడం సులభం అవుతుందని వైసిపి అధినాయకత్వం భావిస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ పార్టీని పటిష్టం చేసే బాధ్యతను ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధకు టిడిపి నాయకత్వం అప్పగించింది.
తాజా మాజీ మంత్రిగా ఉంటూ లోకేష్ గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయారు. ఆయనపై సానుభూతి పవనాలు కనిపిస్తున్నాయి. అటు అమరావతి రాజధాని అంశం కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మొత్తానికి అయితే చంద్రబాబుతో పాటు టిడిపి నేతలను కేసులతో చుక్కలు చూపించిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి వెళ్లడం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సమాచారం. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి మరి.