Jagan: నమ్మకస్తులను వదులుకుంటున్న జగన్… కారణమేంటి?

దీంతో ఆయన అసంతృప్తితో బయటకు వెళ్లిపోయారు. వైసిపి నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు పొమ్మనలేక పొగ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : February 12, 2024 11:07 am
Follow us on

Jagan: గత రెండు ఎన్నికల్లో తనకు వీర విధేయత చూపిన నాయకులను జగన్ పక్కకు తప్పిస్తున్నారు. నమ్మకస్తులైన వారిని సైతం పక్కన పెట్టడం పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. గత పది సంవత్సరాలుగా జగన్ కోసం లాబీయింగ్ చేసిన నేతల్లో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. ఆయనకు రాజ్యసభ ఇచ్చి జగన్ గౌరవించారు. నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా సైతం ప్రకటించారు. కానీ ఆయనతో విభేదించే నాయకులకు పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. దీంతో ఆయన అసంతృప్తితో బయటకు వెళ్లిపోయారు. వైసిపి నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు పొమ్మనలేక పొగ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

మరో నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి కూడా బాగాలేదు. ఆయన పొలిటికల్ జంక్షన్ పై నిలబడ్డారు. ప్రాధాన్యత ఇచ్చినట్టే ఇచ్చి మరో రాజకీయ అవకాశం లేకుండా చేశారు. ఆయనకు ప్రత్యర్థి అయినా వైవి సుబ్బారెడ్డి కి రాజ్యసభ సీటు ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఒంగోలు అసెంబ్లీ సీటును సైతం బాలినేనికి ఖరారు చేయలేదు. ఇప్పుడు కొత్తగా గిద్దలూరు అని చెబుతున్నారు. అది కూడా కన్ఫర్మ్ చేయలేదు. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే.. బాలినేని సైతం వదులుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్లు అర్థమవుతుంది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్ళలేరు. తెలుగుదేశం పార్టీలో చేరుతామన్నా కుదరదు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉన్నా గెలిచే పరిస్థితి లేదు. అందుకే వైసీపీలో ఉంటే కొంత వరకు పోటీ ఇవ్వచ్చని.. గెలిచే ఛాన్స్ ఉందని.. అందుకే ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా అనుభవిస్తూ వస్తున్నారు. అయితే జగన్ తీరును చూస్తుంటే మాత్రం ఎవరికైనా విస్మయం కలగక మానదు. అత్యంత నమ్మకస్తులైన నేతలను చేజేతులా వదులుకోవడం ఏంటన్న ప్రశ్న ఎదురవుతోంది. అసలు జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని వైసీపీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సలహాదారుల ఉచ్చులో పడి జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. రేపు ఓటమి ఎదురైన తర్వాత.. ప్రతికూల ఫలితాలు వచ్చాక పోస్టుమార్టం ప్రారంభమవుతుంది. అంతవరకు ఇది ఒక వ్యూహంగానే ఉంటుంది.