Modi- Jagan: బీజేపీకి వైసీపీ దూరమవుతుందా? అంత సహసం చేస్తుందా? మోదీపై పరోక్షంగా విమర్శలు దేనికి సంకేతం? విజయసాయిరెడ్డి పార్లమెంట్ తో పాటు బయట కేంద్రంపై విమర్శలు గుప్పించడం వెనుక కథ ఏమిటి?.. ఏపీలో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. అసలు వైసీపీ స్వరం మారడానికి కారణం ఏమిటి? జగన్ ఏరికోరి కష్టాలు తెచ్చుకుంటున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయడంలో కేంద్రం వెనుకడుగు వేస్తోంది. దీనికితోడు ఆర్థిక ఆంక్షలు విధిస్తుండడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. ఇటీవల దేశంలో పలుచన అయ్యే విధంగా ఏపీ ఆర్థిక క్రమశిక్షణ తప్పుతోందని గణాంకాలతో సహా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది వైసీపీ అలకకు కారణమైంది. కేంద్రానికి అవసరమైనప్పుడు తాము అండగా ఉన్నామని.. కీలక అవసరాలు తీరాక కేంద్రం స్వరం మార్చడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే నేరుగా కేంద్ర ప్రభుత్వంపైనే జగన్ తో పాటు కీలక నాయకులు విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో రెండు పార్టీల మధ్య స్నేహం చెడిందన్న టాక్ ఏపీతో పాటు ఢిల్లీ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇది మరింత వికటిస్తే జగన్ యూటర్న్ తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణలో ప్రధాని మోదీతో సీఎం జగన్ వేదిక పంచుకున్నారు. కానీ అటు తరువాత కేంద్రం నుంచి వచ్చే ఆహ్వానాలను జగన్ తిరస్కరిస్తున్నారు. కుంటిసాకులు చెబుతూ గైర్హాజరవుతున్నారు. దీంతో అనుమానాలు నిజమవుతున్నాయి.

చంద్రబాబుతో వేదిక పంచుకోలేక…
తాజాగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ఆజాదీ కా అమృత్ దినోత్సవం’ వేడుకలను నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు విపక్ష నేతలకు సైతం ఆహ్వానాలు పంపింది. ఆ జాబితాలో ఏపీ సీఎం జగన్ తో పాటు విపక్ష నేత చంద్రబాబు ఉన్నారు. కానీ చంద్రబాబు కార్యక్రమానికి హాజరుకానున్నట్టు ముందే ప్రకటించారు. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. చంద్రబాబు ఉన్న వేదికను పంచుకోలేననుకున్నారో.. లేక కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితోనో కానీ కార్యక్రమానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమం శనివారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమవుతుందనగా.. సీఎం జగన్ రాత్రి 7.30కు నీతి ఆయోగ్ సమావేశానికి వెళుతున్నారు. అంటే కావాలనే ఆయన కార్యక్రమానికి గైర్హాజరవుతున్నారన్న మాట. అయితే చంద్రబాబుతో వేదికను పంచుకోవాలని ఇష్టం లేకే జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు చంద్రబాబును జగన్ ఫేస్ చేయలేరని.. ఢిల్లీ వేదికగా ఇది బయటపడుతుందనే గైర్హాజరవుతున్నారని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Also Read: China-Taiwan Conflict: తైవాన్ కు అండగా అమెరికా.. చైనాతో యుద్ధం తప్పదా?
ఇటీవల పరిణామాలతో కలవరం..
వాస్తవానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలు వైసీపీకి మింగుడు పడడం లేదు. అల్లూరి విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కానీ సమావేశానికి చంద్రబాబు రాకూడదన్న అభ్యంతరం సీఎం జగన్ నుంచి వచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే టీడీపీ తరుపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును చంద్రబాబు పంపించారు. అయితే ప్రోటోకాల్ జాబితాలో సైతం రాష్ట్ర ప్రభుత్వ మతలబు చేసిందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విస్మయం వ్యక్తం చేసింది. కానీ అప్పటికే రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వైసీపీ సాయం కేంద్రానికి అవసరం. అందుకే కిమ్మనకుండా వ్యవహరించింది. తరువాత మాత్రం రూటు మార్చింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము తనకు మద్దతుగా నిలిచిన సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తరువాత చంద్రబాబును కలిశారు. అయితే చివరి నిమిషం వరకూ తాము చంద్రబాబును కలుస్తున్నట్టు బీజేపీ నేతలు బయటపెట్టలేదు. అయితే తెలిసిన వెంటనే జగన్ వద్దని వారించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయినా అమిత్ షా కలుగజేసుకొని చంద్రబాబును కలవాలని సూచించారు. అక్కడ నుంచి జగన్ లో ఓకింత అసహనం ప్రారంభమైంది.

అంత సీన్ ఉందా?
రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. నామినేషన్ పర్వానికి ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. తెగ హడావుడి చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కనివనీ ఎరుగని మెజార్టీతో ముర్ము విజయం సాధించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అటు తరువాత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ దన్ ఖడ్ ను ఎంపిక చేశారు. అయితే ఆయన నామినేషన్ పర్వానికి మాత్రం వైసీపీకి ఆహ్వానం లేదు. అదే సమయంలో శ్రీలంక ఆర్థిక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటుతున్నాయని 11 రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. అందులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో ఇది విపక్షాలకు ప్రచారాయుధంగా మారింది. అయితే తెరవెనుక ఏదో జరుగుతోందని..బీజేపీ చంద్రబాబుకు స్నేహ హస్తం ఇచ్చిందన్న అనుమానం జగన్ లో ప్రారంభమైంది. అప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో జగడం పెట్టుకున్న సీన్ జగన్ కు ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read:Hyderabad Bhagyanagar: హైదరాబాద్ ఒకప్పుడు భాగ్యనగరమా? చరిత్రను బట్టి అసలు నిజమిదీ!
[…] […]