https://oktelugu.com/

నిస్సహాయతలో జగన్.. ఈ పరిస్థితికి కారణం అదే?

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పుడు జగన్‌కు ఇబ్బందికరంగా మారనుందా..? కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధం కాగా.. మరోవైపు రాష్ట్రంలో ఉద్యమం ఊపందుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అడుగులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ ప్రైవేటీకరణ విషయంలో ఫెయిలయితే మాత్రం జగన్ కు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. అటు కేంద్రంతోనూ కొట్లాడలేక ఇప్పుడు జగన్‌ సందిగ్ధంలో పడ్డారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై ఇప్పటికే విపక్షాలు సైతం జగన్‌ తీరును […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 11:11 am
Follow us on

CM Jagan
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఇప్పుడు జగన్‌కు ఇబ్బందికరంగా మారనుందా..? కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధం కాగా.. మరోవైపు రాష్ట్రంలో ఉద్యమం ఊపందుకుంటోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ అడుగులు ఎటువైపు అన్న చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ ప్రైవేటీకరణ విషయంలో ఫెయిలయితే మాత్రం జగన్ కు భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవు. అటు కేంద్రంతోనూ కొట్లాడలేక ఇప్పుడు జగన్‌ సందిగ్ధంలో పడ్డారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై ఇప్పటికే విపక్షాలు సైతం జగన్‌ తీరును తప్పుబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందుగానే జగన్‌కు చెప్పి స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిందన్న ఆరోపణలు చేస్తున్నాయి. కేవలం ప్రధాని మోదీకి లేఖలు రాసినంత మాత్రాన సరిపోదని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంపై జగన్ ఎలా ఒత్తిడి తీసుకు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే పరిస్థితుల్లో జగన్ లేరు. బీజేపీ కేంద్రంలో బలంగా ఉండటం, వైసీపీ సహకారం ఇప్పట్లో అవసరం ఏమీ లేకపోవడంతో జగన్ నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు. బెదిరింపులకు దిగితే కేంద్ర ప్రభుత్వం దిగివస్తుందన్న నమ్మకం లేదు. మూడు సాగు చట్టాలకు నిరసనగా నెలల తరబడి రైతులు ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేస్తున్నా మోదీ ప్రభుత్వం దిగిరాలేదు. అలాంటిది స్టీల్ ప్లాంట్ విషయంలో వెనకడుగు వేస్తుందన్న నమ్మకం లేదు.

దీంతో జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని బతిమాలుకోవడం మినహా మరేం చేయలేని పరిస్థితి ఉంది. అయితే.. ప్రత్యామ్నాయ మార్గాలను జగన్ దీనిపై అన్వేషిస్తున్నారని చెబుతున్నారు. ప్రైవేటు పరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇది ఎంతవరకూ సాధ్యమన్నది ఇంకా తేలకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఇబ్బందిపడకుండా నిర్ణయం తీసుకోవాలన్నది జగన్ ఆలోచన. చివరకు ఏం చేస్తారో చూడాలి మరి.