రాజకీయాలు అంటేనే కొందరికి గిట్టదు. అందులోనూ ఏపీ రాజకీయాలంటే మరింత తిట్టిపోస్తుంటారు. ప్రధానంగా అక్కడ నడిచేవన్నీ కుల రాజకీయాలే. ఎంతో కష్టపడి.. ప్రజల మన్నలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఇప్పుడు ఇంట్లో వారే చిచ్చుపెట్టేలా తయారయ్యారా..? టీటీడీ చైర్మన్ కిరీటం నెత్తిన పెట్టినందుకు ఇప్పుడు బాబాయి వైవీ సుబ్బారెడ్డితోనే ఆయనకు తలనొప్పి రాబోతోందా..?
Also Read: అంతర్వేది వివాదం.. అసలు ఈ ఆలయ చరిత్ర తెలుసా?
ఏపీలో కొన్ని రోజులుగా రథాల దహనం, వెండి సింహాల అపహరణ, దుండగులు వరుసగా హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తుండడంపైనే రాజకీయం నడుస్తోంది. దాంతోనే లాక్కోలేక పీక్కోలేక అన్నట్లుగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి సీఎం జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. అన్య మతస్థులు డిక్లరేషన్ ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదనేశారు. ఇప్పటికే ఏపీలో మత రాజకీయాలు వేదికగా నిరసనలు నడుస్తుంటే.. ఇప్పుడు తాజాగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో మంటల్లో మరింత పెట్రోల్ పోసినట్లుగా అయింది.
ఇప్పటికే అంతర్వేది ఘటనను అటు బీజేపీ, ఇటు జనసేన, అడపాదడపా టీడీపీ విమర్శిస్తూనే ఉన్నాయి. బీజేపీ–జనసేన పార్టీలైతే ఏకంగా దీక్షలకు దిగారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ పెద్దలనూ అడ్డుకున్నారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు టీడీపీ, బీజేపీకి అస్త్రంలా మారబోతున్నాయి. హిందూ మతం మీద నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ బాబు అప్పుడే పెద్ద గొంతు చేసుకుంటున్నారు. ఇక రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీజేపీ నేత అయిన ఐవైఆర్ కృష్ణా రావు అయితే అంత నమ్మకం లేకపోతే జగన్ తిరుమల రావడం మానుకుంటే బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. వైవీ సుబ్బారావు ఆలోచనలు లేని మాటలతో ఇప్పుడు అందరికీ మరోసారి జగన్ టార్గెట్ అయ్యాడు. బీజేపీ పెట్టిన హిందూ రగడకు కూడా ఇది ఆజ్యం పోసినట్లయింది.
Also Read: తిరుమల డిక్లరేషన్ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి స్పందన
సీఎం జగన్ బ్రహ్మోత్సవాలకు రావడం ఇది రెండో సారి. గతేడాది పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సప్పుడు చేయని వారు ఎప్పుడు నోళ్లు తెరిచి మాట్లాడుతున్నారు. దీనికితోడు వైవీ సుబ్బారెడ్డి కూడా తేనె తెట్టెను కుదిపినట్లుగా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అటు వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఆయన వ్యాఖ్యల వల్ల సీఎం జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్ర పడిపోతున్నారని క్యాడర్ భావిస్తోంది. ఈ దెబ్బతో అయినా జగన్ కళ్లు తెరిచి తన చుట్టూ సమర్థులను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.