జగన్ ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం జరుపుకొంటున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై రాష్ట్ర హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర ఆశాభంగం కలిగించినట్లు తెలుస్తున్నది. ఈ తీర్పుపై అధికార పార్టీకి చెందిన వారెవ్వరూ ఎటువంటి వాఖ్యానాలు చేయక పోవడం గమనార్హం. కేవలం టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాత్రం కోర్టులు తమ పరిధిలో తీర్పులు ఇస్తుంటాయని, వాటిని గౌరవించవలసిందే అంటూ చెప్పారు. తర్వాత ఏమి చేయాలో ముఖ్యమంత్రి నిర్ణయిస్తారని చెప్పారు.
అయితే ఇటువంటి తీర్పు రాగలదని ముందు నుండే ఊహిస్తున్నట్లు కనిపిస్తున్నది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ఎపి సర్కార్ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో తీర్పు రాగానే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్ న్యాయవాదులను సంప్రదించినట్లు చెబుతున్నారు.
తీర్పు తమకు ప్రతికూలంగా వస్తుందని ఊహించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడంతో దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్దపడుతున్నది. అక్కడ సహితం ఇంతకన్నా భిన్నమైన తీర్పు వచ్చే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నప్పటికీ అధికార పక్షం ఆలోచనలు వేరే విధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కనీసం సుప్రీం కోర్ట్ లో స్టే వచ్చేటట్లు చేసుకొని, తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల పక్రియను పూర్తి చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.