Homeఆంధ్రప్రదేశ్‌Jagan Govt Shocks Anganwadis: అంగన్ వాడీలకు జగన్ సర్కారు షాక్..సంక్షేమ పథకాలు కట్

Jagan Govt Shocks Anganwadis: అంగన్ వాడీలకు జగన్ సర్కారు షాక్..సంక్షేమ పథకాలు కట్

Jagan Govt Shocks Anganwadis: అంగన్‌వాడీ సిబ్బందికి జగన్‌ సర్కారు షాకిచ్చింది. జీతాలు పెంచకపోగా, సంక్షేమ పథకాల్లో కోత పెట్టింది. ఆదాయ పరిమితి లోపు ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు ఇవ్వాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. నవరత్నాల అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించరాదు. ఆ పరిధి దాటిన వారు నవరత్నాలకు అనర్హులు. తాజాగా మహిళా, శిశుసంక్షేమ శాఖ ఇచ్చిన సర్కులర్‌ ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే దాదాపు 51 వేలమంది అంగన్‌వాడీ కార్యకర్తల కుటుంబాలకు సంక్షేమ పథకాలు వర్తించవు. పదవీ విరమణ వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అమ్మఒడి, దివ్యాంగ, ఒంటరి మహిళ, వితంతు పింఛన్లు ఇవ్వరు.

Jagan Govt Shocks Anganwadis
Anganwadis

ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణ రాయితీలు కూడా వర్తించవు. పదవీ విరమణ తర్వాత వారి ఆదాయ పరిమితి ప్రభుత్వ నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఉంటే పథకాలు వర్తిస్తాయని సర్కులర్‌లో పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే పక్క రాష్ట్రం తెలంగాణ కంటే రూ.1000 ఎక్కువ జీతం ఇస్తామని జగన్ పేర్కొన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం ఇదే స్పష్టం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.13,650 జీతం వస్తోంది. రిటైర్మెంట్‌ ప్రయోజనం కింద ప్రభుత్వం 5 లక్షలు ప్రకటించింది. మన రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తల జీతం రూ.11,500. రిటైర్మెంట్‌ ప్రయోజనం రూ.50 వేలు మాత్రమే. అక్కడకు, ఇక్కడకు జీతం, రిటైర్మెంట్‌ ప్రయోజనంలో ఎంతో వ్యత్యాసం ఉంది. తెలంగాణలో మాదిరిగా తమకూ జీతాలు పెంచాలని, అందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని పోరుబాట పట్టిన నేపథ్యంలో జగన్ సర్కారు ప్రతిబంధక నిబంధనలు తెరపైకి తెచ్చింది.

Also Read: CM YS Jagan: వైసీపీలో జగన్ పట్టు సడలుతుందా?.. కట్టుదాటుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు

ఇదీ పరిస్థితి..
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో 4,310, గ్రామీణ ప్రాంతాల్లో 46,899, గిరిజన ప్రాంతాల్లో 4,400 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో ఒక అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో మొత్తం లక్షా 20 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని 4310 మంది అంగన్‌వాడీ కార్యకర్తల జీతం (రూ.11,500) ఆదాయ పరిమితి (రూ.12 వేలు) కంటే తక్కువగా ఉన్నందున వారికి ఈ నిబంధనలు వర్తించవు. అలాగే ఆయాలకూ ఈ నిబంధనలు వర్తించవు. వారికి సంక్షేమ పథకాలు అందుతాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 46,899 మంది, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న 4,400 మంది అంగన్‌వాడీ కార్యకర్తల జీతం (రూ.11,500) ఆదాయ పరిమితి (రూ.10,000) దాటినందున వారికి సంక్షేమ పథకాలు వర్తించవు. అంటే దాదాపు 51 వేల మంది కుటుంబాలకు పథకాల్లో కోత పడుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదాయ పరిమితి నిబంధనల నుంచి వెసులుబాటు ఉండేది. వారికి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేశారు.

టీడీపీ హయాంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ డిమాండ్లు సాధించుకున్నారు. చంద్రబాబు హయాంలోనే వేతనాలు అధికంగా పెరిగాయి. 2018 జూలైలో జీవో నెంబరు 18 ఇచ్చి.. అంగన్‌వాడీ కార్యకర్తల జీతం రూ.7000 వేల నుంచి రూ.10,500కు, ఆయాల జీతం రూ.4500 నుంచి రూ.6000కు పెంచారు. ఆదాయ పరిమితికి మించి ఉన్నా గత ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చి అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్ల జీతం రూ.1000 మాత్రమే పెంచింది. ఇప్పుడు ఆదాయ పరిమితి పేరుతో సంక్షేమ పథకాల్లోనూ కోత విధిస్తోంది.

Jagan Govt Shocks Anganwadis
Y S Jagan

వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయంపై అంగన్‌వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. జీతాలు పెంచకపోగా, సంక్షేమ పథకాలకూ దూరం చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆదాయ పరిమితులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అంగన్‌వాడీ కార్యకర్తలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతున్నారు. 2020 మార్చి నుంచి రిటైర్డ్‌ అయినవారు ఇప్పటికీ రిటైర్మెంట్‌ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని, అవీ సక్రమంగా ఇవ్వడంలేదని మండిపడుతున్నారు. వచ్చే వేతనంతో కుటుంబ పోషణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పథకాలు ఎగ్గొట్టడానికి ఆదాయ పరిమితిని సాకుగా చూపడం సరికాదన్నారు.

Also Read:AP Congress: జగన్ తో పోరాటానికే సై అంటున్న కాంగ్రెస్?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular