AP CM Jagan : ఎన్నో ఒడుదుడుకుల నడుమ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీతో విబేధించి వైఎస్సార్ పార్టీని స్థాపించారు. 2014లో ఓడిపోయినా, 2019లో విజయాన్ని అందుకున్నారు. అందుకోసం తన అనుకున్నవారందరినీ గెలిపించుకున్నారు. కష్ట సమయాల్లో ఆదుకున్న వారందిరినీ, గుర్తు పెట్టుకొని మరీ టిక్కెట్లు ఇచ్చారు. టీడీపీ చేసిన తప్పిదాలను అనుకూలంగా మార్చుకొని సఫలీకృతులయ్యారు.
2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ బాగా ఉంది. అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏ పనిచేసినా, భూతద్దంలో చూపేందుకు పీకే టీం బాగా పనిచేసింది. ప్రజల్లో సానుకూల పవనాలు తీసుకురావడంలో కీలకంగా మారింది. జగన్ అప్పటికే జైలుకెళ్లి వచ్చి ఉన్నారు. సీబీఐ ఎంక్వైరీలు నడుస్తున్నాయి. నిర్బంధాల మధ్యే జగన్ ప్రచారం సాగింది. ఇదంతా సర్దుకుపోవాలంటే, ఒక్కసారి అధికారం చేపడితే చాలనుకున్నారు. అప్పటి వరకు జరిగినదంతటినీ సానుభూతి కింద మార్చుకొని ఒక్కసారి అవకాశం ఇస్తే చూద్దాం అన్న ఆలోచనలను ప్రజల్లో తీసుకువచ్చారు. ఫ్యాన్ గాలి బాగా వీచింది.
ముఖ్యమంత్రి జగన్ తన అనుకున్న వారిని గెలిపించుకుంటారనే మాట కూడా ఉంది. 2019 ఎన్నికల్లో సాధారణ కార్యకర్త అయిన తాడేపల్లికి చెందిన నందిగం సురేష్‌కు బాపట్ల ఎంపీగా అవకాశం కల్పించారు. టీడీపీ అమరావతి భూముల విషయంలో రైతులను హింసపెడుతుందని జగన్ సభలో చెప్పుకొని బాధపడ్డారు. అంతే బాపట్లలో ఆయనకు ఎంపీగా సీటు ఇచ్చి గెలిపించుకున్నారు. అలాగే, వివేకా స్థానంలో అవినాష్ రెడ్డికి కూడా కడప ఎంపీగా సీటు ఇచ్చి గెలిపించుకోవడమేకాక, వివేకా హత్య కేసులో నుంచి ఆయనను బయటపడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే అపవాదు కూడా మూటగట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులకు టార్గెట్లు పెట్టారు. తన అనునాయులకు గెలవడమే ముఖ్యంగా పనిచేశారు.
అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రతి పని బెడిసికొడుతోంది. తండ్రి బాటలో నడుస్తున్నట్లు ఆయన చెబుతున్న మాటలు సత్య దూరంలో ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తండ్రి బాటలో నిత్యం ప్రజల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ తరహా వాతావరణం క్రమేణా దూరమవుతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజా దర్బార్, రచ్చబండ వంటి కార్యక్రమాలు నిర్వహించి నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేవారు. కానీ, నాలుగేళ్లు గడుస్తున్నా జగన్ ప్రజలకు కలిసే అవకాశం ఇచ్చింది చాలా తక్కువ. పైగా ఆయన సభలు జరుగుతున్నాయంటే, ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొల్పుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగన్ పార్టీ మొత్తాన్ని గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.