Jagan Ali: ఎన్నో వేచిన ఉదయం ఇప్పుడు సాకారమైంది. 2019 అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబు, పవన్ లను కాదని మరీ జగన్ కు సపోర్టు చేసి.. వైసీపీ తరుఫున ప్రచారం చేశాడు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ. నిజానికి గుంటూరు జిల్లాలోని ఒక అసెంబ్లీ సీటును అలీ ఆశించి జగన్ ను కలిశాడు. కానీ అప్పటికే కేటాయింపులు అయిపోవడంతో ఎమ్మెల్సీ లేదా? ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చాడు.

అయితే జగన్ అధికారంలోకి మూడేళ్లు గడిచిపోయినా కూడా టాలీవుడ్ నుంచి అలీకి పదవి ఇవ్వలేదు. ఫృథ్వీకి, మరో నటుడికి పదవులు ఇచ్చిన జగన్.. అలీ, పోసాని, మోహన్ బాబు లాంటి వారిని కనికరించలేదు. చాలా రోజులు వెయిట్ చేయించాక ఎట్టకేలకు అలీకి ఒక పదవి ఇచ్చాడు.
ఎట్టకేలకు కమెడియన్ అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ జగన్ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ నియామకంతో రెండేళ్లు ఈ పదవిలో కొనసాగుతారనీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అంటే జగన్ పరిపాలన ఉండే రెండేళ్ల వరకే ఈ పదవి ఉండనుంది.
జగన్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ పదవి ఇచ్చి ఉంటే కనీసం ఐదేళ్లు ఆ అధికారాన్ని అలీ అనుభవించేవారు. ఇప్పుడు రెండేళ్లు మాత్రమే పదవి ఇవ్వడంపై అందరూ పెదవి విరుస్తున్నారు. ఇక చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు సినిమాల్లో అవకాశాలు లేక రాజకీయాల బాట పట్టిన అలీ ఈ పదవితోనే సర్దుకుంటాడని చెప్పొచ్చు.