స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సీఎం గుర్రు

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అవి వాయిదా పడటంతో ఆయన తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే ఎన్నికల్లో విజయం సాధించని నియోజకవర్గాల మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యేలకు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 6:10 pm
Follow us on

స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అవి వాయిదా పడటంతో ఆయన తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల కోసం క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే ఎన్నికల్లో విజయం సాధించని నియోజకవర్గాల మంత్రులు వెంటనే రాజీనామాలు చేయాల్సి ఉంటుందని సీఎం హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యేలకు అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. అధిష్టానం అలాంటి నిర్ణయం ప్రకటించడంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. యథేచ్ఛగా హింసకు తెర తీశారు. ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించడంతో జెడ్పీటీసీలు 652 స్థానాల్లో 126, 9, 696 ఎంపీటీసీల్లో 2, 362 స్థానాల్లో ఏకగ్రీవం చేయగలిగారు. ఒక్క కడప జిల్లానే తీసుకుంటే 50 జెడ్పీటీసీల్లో 38, 553 ఎంపీటీసీల్లో 439 స్థానాలు ఏకగ్రీవం కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల్లో ఓటింగ్ జరగక ముందే ఇన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో సిద్ధంగా ఉన్న వైసీపీకి ఎన్నికలు ఆరు వారాలు వాయిదా పడటం ఇబ్బంది కరంగా మారింది. అధికారం చేపట్టిన పది నెలల్లో ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నా ఏనాడూ ప్రెస్ మీట్ పెట్టని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన వెంటనే నిర్వహించడం విశేషం.

ఎన్నికల వాయిదాకు ప్రతిపక్షాల మద్దతు:

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, ప్రభుత్వం, పోలీసుల పక్షపాత వైఖరులను ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు బీజేపీ, జనసేన, సీపీఐ ఖండిస్తూ వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా ఈ ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాయి. ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు ముఖ్యం కాదనేది ఈ పార్టీల వాదనగా ఉంది. మరోవైపు ఇళ్ల పట్టాల పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ పేరుతో ప్రజల్లో ఆశలు కల్పించి ఎన్నికల్లో ఓట్లు పోగేసుకోవాలనుకుంటున్న వైసీపీకి వాయిదా పడటం సుతరామూ ఇష్టం లేదు.

తప్పులను కప్పి పుచ్చుకునేందుకే:

మూడు రాజధానులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అంశాలపై ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా.. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారని చెప్పుకోవాలని వైసీపీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదన చేయడానికి ప్రధాన కారణం టీడీపీని దెబ్బ తీయడానికేనన్న విషయం అందరికీ తెలిసిందే. మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రజలు అంగీకరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించారన్న వాదనను తెరపైకి తీసుకురావాలని ఆ పార్టీ భావించింది. టీడీపీకి పట్టున్న అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి, జక్కంపూడి పంచాయతీ, తదితర ప్రాంతాలకు అసలు ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదు. దీని వెనుక అసలు ఆలోచన అదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.